40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత
తాను ప్రేమించిన ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రియుడు కొన్ని షరతులు విధించాడు. 40 రోజుల్లో నమాజ్ చేయడం నేర్చుకోవాలని, ముస్లిం మతంలోకి మారిన తర్వాతే పెళ్లి చేసుకుంటానంటూ కండిషన్ పెట్టాడు. దీంతో షాక్‌కు గురైన ఆ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగుళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు గురువారం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషనులో మహమ్మద్ ఇషాక్‌పై కేసు పెట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలికి, మహమ్మద్ ఇషాక్‌కు 2024 అక్టోబరు నెల 17వ తేదీన ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే అది ప్రేమగా మారింది. అదే ఏడాది అక్టోబరు 30న తణిసాంద్ర ప్రాంతంలోని ఓ మాల్లో కలుసుకున్నప్పుడు, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని ఇషాక్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దసరహళ్లిలో ఓ గదిని బుక్ చేసి, పెళ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది.
అయితే, కొంతకాలంగా ఇషాక్ ప్రవర్తనపై అనుమానం రావడంతో, అతడికి వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని బాధితురాలు తెలుసుకుంది. పెళ్లి విషయం ప్రస్తావించినప్పుడల్లా అతడు ఏదో ఒక కారణం చెప్పి దాటవేసేవాడు. ఈ క్రమంలోనే, 2025 సెప్టెంబరు 14న ఇషాక్‌కు మరో ముస్లిం యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. దీనిపై నిలదీయగా, తనను మళ్లీ సంప్రదిస్తే చంపేస్తానని బెదిరించి, దూషించాడని ఆమె వాపోయింది.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఇషాక్ కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని నమ్మించారు. అయితే, ఇషాకు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఇస్లాం మతంలోకి మారాలని అతడి అన్న, బావ స్పష్టం చేసినట్లు బాధితురాలు తెలిపింది. 40 రోజుల్లో నమాజ్ చేయడం నేర్చుకోవాలని, మతం మారిన తర్వాతే పెళ్లి గురించి చర్చిస్తామని వారు షరతు పెట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.