శనివారం, 4 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (13:57 IST)

సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకున్న కావలి ఎమ్మెల్యే... ఖాతా నుంచి రూ.23.69 లక్షలు ఖాళీ

cyber attack
సైబర్ నేరగాళ్ళ మోసాలకు సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. విద్యావంతులు, ప్రజాప్రతినిధులు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కావలి ఎమ్మెల్యే డి. వెంకట కృష్ణారెడ్డి ఈ కోవలోనే భారీ మొత్తంలో డబ్బును నష్టపోయారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి పంపిన లింకును క్లిక్ చేసి ఏకంగా రూ.23.69 లక్షలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగస్టు 15వ తేదీన ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ)కు బకాయిలు చెల్లించాలంటూ అందులో ఒక లింక్ ఉంది. కాంట్రాక్టర్, క్వారీ యజమాని అయిన ఎమ్మెల్యేకు వ్యాపారరీత్యా పలు రవాణా వాహనాలు ఉండటంతో నిజంగానే బకాయిలు ఏమైనా ఉన్నాయేమోనని భావించి ఆ లింకుపై క్లిక్ చేశారు.
 
అంతే, కొన్ని క్షణాల్లోనే ఆయన ఫోన్ వేడెక్కిపోయి, స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫోనులోని జియో సిమ్ కూడా పనిచేయడం మానేసింది. వెంటనే ఆయన జియో సిబ్బందిని సంప్రదించగా, వారు చెప్పిన సూచనలు పాటించినా సిమ్ యాక్టివేట్ కాలేదు. దీంతో ఆయన హైదరాబాద్ నగరంలోని ఆధార్ విజిలెన్స్ విభాగాన్ని ఆశ్రయించారు. వారి సహాయంతో సిమ్‌ను తిరిగి యాక్టివేట్ చేయగా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
ఆయనకు సంబంధించిన రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.23.69 లక్షలు విత్ డ్రా అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్‌లు వచ్చాయి. సిమ్ బ్లాక్ అయిన సమయంలోనే సైబర్ నేరగాళ్లు తమ పని కానిచ్చారని గ్రహించిన ఎమ్మెల్యే, నాలుగు రోజుల క్రితం కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.