డ్రైవింగ్ లైసెన్సుల గడువు పొడగింపు
గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్సుల గడువును మరోమారు కేంద్రం పొడగించింది. ఈ యేడాది ఫిబ్రవరి 1తో అనేక సర్టిఫికేట్ల గడువు ముగిసిపోయింది. ఇలాంటివాటిలో డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.
ఈ యేడాది కొవిడ్ కారణంగా వాటిని పొడిగించుకోలేకపోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020, ఫిబ్రవరి 1తో గడువు ముగిసినా.. అవి మార్చి 31, 2021 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
ఇలాంటి కీలకమైన డాక్యుమెంట్ల చెల్లుబాటు తేదీని ప్రభుత్వం పొడిగించడం ఇది నాలుగోసారి. నిజానికి ఈ యేడాది డిసెంబర్ 31 వరకే వీటి గడువు పొడిగిస్తున్నట్లు ఆగస్టులో ప్రభుత్వం చెప్పింది.
గడువు ముగిసిన డాక్యుమెంట్లను పునరుద్ధరించుకోవడానికి చాలా మంది రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయని, దీనివల్ల కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా వీటి గడువును మరోసారి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.