జట్టుగా రాణిస్తున్నాం... మా లక్ష్యం నెరవేరింది... : రోహిత్ శర్మ
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఫలితంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ముంబై వాంఖేడ్ స్టేడియంలో మ్యాచ్ ముగిశాక టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ, తాము టోర్నీలో అధికారికంగా సెమీస్‌లో ప్రవేశించామన్న విషయం తెలిసి ఎంతో ఆనందం కలిగిందని చెప్పాడు.
భారత్ వరల్డ్ కప్ ప్రస్థానం చెన్నైలో షురూ అయిందని, ఇప్పటివరకు ఓ జట్టుగా రాణించామని తెలిపాడు. ఈ మెగా టోర్నీలో తొలుత తగినన్ని పాయింట్లతో అర్హత పొంది సెమీస్ చేరడాన్ని గోల్‌గా నిర్దేశించుకున్నామని, ఆ తర్వాత ఫైనల్ చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ శర్మ వివరించాడు. తాము ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రాణించి, జట్టు జైత్రయాత్రకు సాయపడ్డారని వెల్లడించాడు.
వాంఖేడ్ పిచ్‌పై 350 పరుగులు అంటే మంచి స్కోరు సాధించినట్టేనని తెలిపాడు. ఈ ఘనత బ్యాట్స్‌మెన్లకు చెందుతుందని, ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించారని హిట్ మ్యాన్ కొనియాడాడు. ఇక, తమ తదుపరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉందని, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముందని తెలిపాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులకు కనులవిందు ఖాయమని అభిప్రాయపడ్డాడు.