1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (12:33 IST)

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రాస్ టేలర్ గుడ్‌బై - కివీస్ తరపున ఏకైక ఆటగాడు...

న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు స్వస్తిచెప్పనున్నాడు. త్వరలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ జట్లతో జరిగే క్రికెట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించనున్నట్టు ఆయన గురువారం ప్రకటించాడు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
గత 17 యేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, 37 యేళ్ల రాస్ టేలర్ కివీస్ తరపున అనేక రికార్డులు నెలకొల్పారు. 2008లో సౌతాఫ్రితాతో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన ఆయన... ఇప్పటివరకు 112 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7,584 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. కివీస్ ఆటగాడు కేన్ విలియమ్స్ తర్వాత అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడు టేలర్ కావడం గమనార్హం. 
 
అలాగే, 2006లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డే కెరీర్‌ను ప్రారంభించిన రాస్ టేలర్... మొత్తం 233 వన్డేలు ఆడి 21 సెంచరీలతో 8,581 పరుగులు చేశాడు. తద్వారా వన్డేల్లో కివీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు. 
 
అదేవిధంగా ఇప్పటివరకు 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో అన్ని ఫార్మెట్లలో వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఘనత రాస్ టేలర్‌కు దక్కుతుంది. ఈ క్రమంలో తన సొంత గడ్డపై మార్చి నెలాఖరులో నెదర్లాండ్స్ జట్టుతో కివీస్ వన్డే సిరీస్ ఆడనుంది. అంటే ఏప్రిల్ 4వ తేదీన హామిల్టన్ వేదికగా జరిగే వన్డే మ్యాచ్‌తో రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియనుంది.