శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:09 IST)

ఐసీసీ ప్రపంచ కప్ : సౌతాఫ్రికాపై పోరాడి ఓడిన శ్రీలంక

srilanka team
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పోరాడి ఓడింది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 428 పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 326 పరుగులు చేసి ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యం 429 పరుగులు... అయినప్పటికి శ్రీలంక వెనుకంజ వేయకుండా చివరి వికెట్ వరకు పోరాడి ఓడింది. ఈ పోరులో ఇరుజట్లు కలిసి మొత్తం 754 పరుగులు చేయడం విశేషం.
 
తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగులు చేయగా, శ్రీలంక ఛేదనలో 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. 102 పరుగుల మార్జిన్‌తో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. లంక జట్టులో ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక (0), కుశాల్ పెరీరా (7) స్వల్ప స్కోర్లకే అవుటైనా... కుశాల్ మెండిస్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆశలు రేకెత్తించాడు. మెండిస్ 42 బంతుల్లో 76 పరుగులు సాధించడం విశేషం. మెండిస్ స్కోరులో 4 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయంటే అతడి దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఆ తర్వాత చరిత్ అసలంక కూడా తన వంతు పోరాటం చేశాడు. అసలంక 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు నమోదు చేశాడు. భారీ లక్ష్యఛేదనలో లంకేయులు దూకుడు కొనసాగించినప్పటికీ, భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యారు. కీలక దశలో వికెట్లు కోల్పోవడం ప్రతికూలంగా పరిణమించింది. కెప్టెన్ దసున్ షనక సైతం పోరాట ర్తి కనబర్చాడు. షనక 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు సాధించాడు. బౌలర్ కసున రజిత 31 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అయితే, లక్ష్యం మరీ భారీగా ఉండడంతో లంకేయుల శక్తికి మించిన పనైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయిట్టీ 3 వికెట్లు పడగొట్టగా, మార్కో యాన్సెన్ 2, కగిసో రబాడా 2, కేశవ్ మహరాజ్ 2, లుంగీ ఎంగిడి 1 వికెట్ తీశారు.
 
అంతకుముందు సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఏకంగా సెంచరీలు సాధించారు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోరు (428/5) సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా పేరిట (417/6) ఉన్న రికార్డును అధిగమించింది. అలాగే ఈ మెగా ఈవెంట్లో ఎక్కువసార్లు (3) 400+ రన్స్ సాధించిన టీమ్ గానూ రికార్డు. ప్రపంచ కప్‌లో ఒకే టీమ్ నుంచి ముగ్గురు శతకాలు బాదడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా వన్డేల్లో నాలుగోసారి.