శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (14:16 IST)

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఈ మెగా మ్యాచ్‌లో విజేత ఎవరో..?

India
వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌కు టైమ్ దగ్గరపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే మెగా ఫైనల్‌తో ఈ ఫస్ట్ టెస్ట్ ప్రపంచకప్ ముగియనుంది. తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఫైనల్ మ్యాచ్‌ల్లో తమ అలవాటుగా మారిన తడబాటుకు బ్రేక్ వేయాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు. ఏదేమైనా హోరాహోరీ తప్పదనిపిస్తున్న ఈ మెగా మ్యాచ్‌లో విజేత ఎవరనేది తేలాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.
 
డబ్ల్యూటీసీలో భాగంగా భారత్ ఇప్పటి దాకా 17 టెస్ట్‌లు ఆడగా.. 12 విజయాలు సాధించింది. నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగించింది. అయితే భారత్ ఓడిన నాలుగులో రెండు న్యూజిలాండ్ చేతిలో ఎదురైనవి కావడం గమనార్హం.
 
ఇక, ఆ రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌లోనే జరిగాయి. ఇంగ్లండ్ పరిస్థితులు కివీస్‌కు దగ్గరగా ఉంటాయి. దీంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతున్న కోహ్లీ సేన.. ట్రెంట్ బౌల్ట్ ఆధ్వర్యంలో కివీస్ బౌలింగ్ అటాక్‌కు ఎలా బదులిస్తుందనేది ఆసక్తిగా మారింది.
 
మరోపక్క భారత టాప్ బ్యాట్స్‌మెన్ ఫామ్ కూడా కలవరపెడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును గత మంగళవారం ప్రకటించింది. దీని ప్రకారం రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయమైంది. 
 
ఈ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా ఇంగ్లండ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్ చేసింది లేదు. రోహిత్ 2014లో ఇంగ్లండ్‌లో ఓ టెస్ట్ ఆడాడు. గిల్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో ఇంగ్లిష్ కండిషన్స్‌లో అనుభవం లేని ఈ ఓపెనింగ్ కాంబో ఏం చేస్తారో ఊహించలేమని క్రీడా పండితులు అంటున్నారు.