ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమం: తలకు బంతి బలంగా తగిలి..?
ఆసీస్ యువ బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూజెస్ (25) పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో న్యూ సౌత్ వేల్స్ - సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫిల్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇండియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఫిల్కు పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ హ్యూజెస్ షెఫీల్డ్ మ్యాచ్‌లో కూడా 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు
ఈ నేపథ్యంలో షాన్ అబాట్ విసిరిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన ఫిల్... హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతని తల పక్క భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో పిచ్ మీద ఫిల్ హ్యూజెస్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిల్‌ను మూడు అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు.
ఫిల్‌ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫిల్కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది.