మొదట బౌలర్లు..తర్వాత బ్యాట్స్‌మెన్లూ సెల్ఫ్ గోల్ వేసేశారు.. చిత్తుగా ఓడిన భారత్
జట్టుకూర్పులో దాచిపెట్టిన లోపాలు ఒక్కసారిగా ముందుకొస్తే ఏమవుతుందో భారత జట్టు అక్షరాలా తన పరాజయం ద్వారా నిరూపించింది. పోరాటమంటేనే ఏమిటో తెలియదన్న స్థాయి ప్రదర్శన చేసిన భారత జట్టు కీలకమైన చాంఫియన్స్ టోర
జట్టుకూర్పులో దాచిపెట్టిన లోపాలు ఒక్కసారిగా ముందుకొస్తే ఏమవుతుందో భారత జట్టు అక్షరాలా తన పరాజయం ద్వారా నిరూపించింది. పోరాటమంటేనే ఏమిటో తెలియదన్న స్థాయి ప్రదర్శన చేసిన భారత జట్టు కీలకమైన చాంఫియన్స్ టోర్నీలో దాయాది చేతికి చేజేతులా విజయాన్ని అందించింది. సెమీఫైనల్ వరకు అలసట లేకుండా అద్వితీయ ఆటను ప్రదర్సించిన ప్రపంచ నంబర్ టూ జట్టు ప్రపంచ 8వ నంబర్ జట్టు చేతిలో ఒక్కసారిగా సాగిలబడిపోయింది. విజయం సాధించడం ఇంత సులభమా.. అదీ పైనల్లో అనిపించేంత సులువుగా పాక్ టీమిండియాపై అద్వితీయ విజయం సాధించింది. గత పదేళ్లుగా మేజర్ టోర్నీల్లో సత్తా చూపలేక వెనుతిరిగిన పాకిస్తాన్ తన క్రికెట్ చరిత్రలోనే గేమ్ చేంజర్ అనిపించుకున్న గొప్ప విజయంతో సగర్వంగా తలెత్తి నిలిచింది.
చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో భారత్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన తుది పోరులో విరాట్ సేన చిత్తుగా ఓడింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాపార్డర్ పూర్తిగా వైఫల్యం చెందడంతో భారత జట్టు జీర్ణించుకోలేని పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క హార్దిక్ పాండ్యా(76; 43 బంతుల్లో 4 ఫోర్లు,6 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోవడంతో భారత్ కు అతి పెద్ద ఓటమి ఎదురైంది. హార్దిక్ తరువాత శిఖర్ ధావన్(21), యువరాజ్(22), రవీంద్ర జడేజా(15)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, విరాట్ కోహ్లి(5) ఎంఎస్ ధోని(4), కేదర్ జాదవ్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు.
అమీతుమీ పోరులో భారత్ జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో వరుసగా రెండో సారి ట్రోఫీ సాధించాలనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. మరొకవైపు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరిన పాకిస్తాన్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ బౌలర్లలో మొహ్మద్ అమిర్, హసన్ అలీ తలో మూడు వికెట్లతో భారత్ జట్టు వెన్నువిరవగా, షాదబ్ ఖాన్ కు రెండు, జునైద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.
అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి 71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.
అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధవన్ (21), యువరాజ్ సింగ్ (22), హార్ధిక్ పాండ్యా (76), రవీంద్ర జడేజా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ 2, జునైద్ ఖాన్ 1 వికెట్ నేలకూల్చాడు.