సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (19:37 IST)

ఢాకా పులులను చితక్కొట్టిన కరేబియన్ కుర్రోళ్లు.. బంగ్లా టార్గెట్ 322 రన్స్

ప్రపంచ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలింగ్‌ను వెస్టిండీస్ యువ క్రికెటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ కేవలం డకౌట్ అయినప్పటికీ బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో విండీస్ స్కోరు 300 మార్కు దాటింది. దీనికి కారణం యువక్రికెటర్ల చలవే. 
 
ఈ మ్యాచ్‌లే తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో కరేబియన్ జట్టు తరపున ఓపెనర్ ఎవిన్ లూయిస్ 67 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. వికెట్ కీపర్ షై హోప్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హోప్ 96 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. 
 
అలాగే, నికొలాస్ పూరన్ (25), హెట్మెయర్ (50), కెప్టెన్ హోల్డర్ (33), డారెన్ బ్రావో (19) అందరూ కలిసికట్టుగా కదం తొక్కడంతో విండీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు సాధించింది.
 
హెట్మెయర్ కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ హోల్డర్ 15 బంతులాడగా, వాటిలో 4 ఫోర్లు, 2 సిక్స్‌లున్నాయి. చివర్లో డారెన్ బ్రావో రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు. ఇలా.. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను కరేబియన్ ఆటగాళ్లు చీల్చిచెండారారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్, సైఫుద్దీన్‌లకు చెరో 3 వికెట్లు లభించాయి. సీనియర్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి.