ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (08:37 IST)

దూరం పెడుతుందనీ ప్రియురాలిని కత్తితో పీకకోసి చంపేశాడు.. ఆపై ఆత్మహత్య...

murder
తనను దూరం పెడుతుందన్న అనుమానంతో ప్రియురాలిని చంపేసిన ఓ వ్యక్తి చివరకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏలూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగర శివారు శనివారపుపేటకు చెందిన ఉడతా సుజాత(30)గా గుర్తించారు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది.. ఎవరు చంపారు.. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. 
 
ఆమె మృతి చెందిన ఇంట్లో దిమ్మిటి సత్యనారాయణ(40) నివాసముంటున్నాడు. అతనికి వివాహమైనా భార్యతో విభేదాలు రావడంతో ఐదేళ్ల క్రితం భార్యను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా అతనితో సన్నిహితంగా మెలుగుతుంది. అప్పుడప్పుడూ అతని ఇంటికి వచ్చి వెళ్లేది. 
 
అయితే, తనతో సన్నిహితంగా ఉండే సుజాతను సత్యనారాయణ కత్తితో పీక కోసి చంపాడు. ఆదివారం రాత్రి తన ఇంటికొచ్చిన ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న సుజాతను అక్కడే వదిలేసి సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. పోలీసులకు దొరికిపోతానేమోనని భయపడ్డాడు. 
 
అలా నూజివీడు సమీపంలోకి చేరుకున్నాక రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బ్రిడ్జి కింద తన ద్విచక్ర వాహనం పెట్టి పట్టాలు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతని జేబులో ఓ చీటీపై పేరు, చిరునామా ఉండటంతో వివరాలు తెలుసుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని, అతని జేబులో ఉన్న చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
 
సత్యనారాయణ ఈ ఘాతుకానికి పాల్పడేముందు సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. తనను కొద్ది రోజులుగా సుజాత దూరం పెడుతోందని.. గతంలో బాగానే ఉండేదని.. ఆమెకు తాళి కూడా కట్టానని లేఖలో రాశాడు. పైగా, గత కొద్ది రోజులుగా తనను అవమానిస్తోందని, అందుకే ఆదివారం రాత్రి నమ్మకంగా ఇంటికి పిలిపించుకుని చంపేసినట్టు పేర్కొన్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
కాగా, మృతురాలు సుజాతకు కూడా భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త లారీ డ్రైవర్. శనివారపు పేటలో ఉంటున్నారు. ఈయన సత్యనారాయణకు స్నేహితుడు. ఈ కారణంగానే సత్యనారాయణకు సుజాత పరిచయమైంది. భర్త విధులకు వెళ్లినపుడు సత్యనారాయణతో ఏకాంతంగా గడుపుతూ వచ్చింది. ఈ నెల 23వ తేదీన సుజాత భర్త భోపాల్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సత్యనారాయణ.. సుజాతను నమ్మించిన తన ఇంటికి పిలిపించుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.