గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:41 IST)

మాండ్య జిల్లాలో దారుణం : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ దారుణం రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేఆర్ఎస్ గ్రామంలో జరిగింది. మృతుల్లో 12 యేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉండటం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలోని బజార్ లైనుకు చెందిన లక్ష్మి (30), రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్ (12)లంతా కలిసి ఒకే ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ప్రవేశించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకుని పారిపోయారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈయన తన సొంతూరికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలకు పాల్పడిన దుండగుల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఐసీ, ఎస్పీలు వెల్లడించారు.