బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (09:26 IST)

భార్యతో వివాదం... బాంబు ఉందంటూ పోలీసులకు భర్త ఫోన్..

bombsquad
హైదరాబాద్ నగరంలో విచిత్ర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త వైఖరితో విసిగిపోయిన ఓ భార్య... తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యను తిరిగి తన వద్దకు రప్పించుకునేందుకు ఆ భర్త తనకు తెలిసిన కొన్ని ప్రయత్నాలు చేశాడు. తన ఇంట్లో బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. 
 
దీంతో బాంబు స్క్వాడ్ బృందం వచ్చి తనిఖీలు చేయగా, అంతా ఉత్తుత్తేనని తేల్చారు. ఆ తర్వాత ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. దీంతో తప్పుడు ఫోన్ కాల్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 18 రోజుల జైలుశిక్షి విధించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చాంద్రాయణగుట్టం, రియాసత్ నగర్‌ డివిజన్ రాజనర్సింహ నగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ ఖాన్ అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానసయ్యాడు. దీంతో కట్టుకున్న భార్యతో పొద్దస్తమానం గొడవ పెట్టుకోసాగాడు. భర్త వైఖరితో విసిగిపోయిన ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆ తర్వాత భార్యను తన వద్దకు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఐఎస్ సదన్ కూడలిలో మందిర్ - మసీదు వద్ద బాంబు ఉందంటూ అర్థరాత్రి సమయంలో 100కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాల బృందంతో అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
చివరకు అలాంటిదేమీ లేదని తేల్చారు. ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 18 రోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్ రావు తీర్పునిచ్చారు.