మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2022 (18:49 IST)

5G SIM అప్‌గ్రేడ్ పేరుతో లింక్‌, క్లిక్ చేస్తే బ్యాంక్ డబ్బు గోవిందా...

cyber hackers
5G సేవలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసితో సహా ఇతర ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 5G సేవలు కొన్ని నగరాల్లో మొదలయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి వంటి నగరాల వినియోగదారులకు 5G సిగ్నల్ లభించడం ప్రారంభమైంది.


ఇప్పుడు 5G లాంచ్‌తో సైబర్ దొంగలు కూడా చాలా యాక్టివ్‌గా మారారు. 5G SIM అప్‌గ్రేడ్ పేరుతో ఉన్న లింక్‌ను పంపుతున్నారు. పొరబాటును యూజర్లు ఆ లింకు పైన క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బు మాయమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు యూజర్లను అప్రమత్తం చేశారు. 

 
5G సిమ్ అప్‌గ్రేడ్ పేరుతో కొందరికి సందేశాలు వచ్చాయి. నిజమే అనుకుని ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వారి బ్యాంక్ ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా అయినట్లు తెలుసుకున్నారు. సిమ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి తమ టెలికాం కంపెనీ లింక్‌ను పంపిందని భావించడంతో ఇలా జరుగుతోంది.


సైబర్ దొంగలు 5Gపై నెలకొన్న ప్రజల ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాము పంపిన లింక్ క్లిక్ చేయగానే సదరు హ్యాకర్లు వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తున్నారు. ఈ దొంగలు రిమోట్ యాప్‌ను వ్యక్తుల ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసి, ఆపై రిమోట్‌గా కూర్చొని ఫోన్‌ను నియంత్రిస్తూ డబ్బు కాజేస్తున్నారు.

 
ఈ నేపధ్యంలో 4G నుండి 5Gకి అప్‌గ్రేడ్ చేయాలంటూ వస్తున్న లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. అసలు 5G అప్ గ్రేడ్ చేసేందుకు మీరు సిమ్‌ని మార్చాల్సిన అవసరం లేదని, ఏదైనా లింక్‌పైన కూడా క్లిక్ చేయాల్సిన అవసరం లేదని టెలికాం కంపెనీలు కూడా ఇప్పటికే స్పష్టం చేసాయి. రియల్ మీ, క్జియామీ, మొటొరోలా, శాంసంగ్ తదితర ఫోన్లలో 5G అప్ గ్రేడ్ జరిగిపోతుంది. ఒక్క ఐ-ఫోన్ విషయంలోనే కొంతకాలం వేచివుండాల్సి వుంటుంది.