గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (07:34 IST)

తన కోడలు సంపాదన పుట్టింటికి ఇస్తుందని అత్త ఆత్మహత్య.. ఎక్కడ?

suicide
తన ఇంటి కోడలు సంపాదన మొత్తం పుట్టింటికి ఇస్తుందని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శాస్త్రీపురం కింగ్స్‌ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో ఉండే మెరాజ్‌ సుల్తానా(48) భర్త మఖ్దూం అహ్మద్‌ ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. 
 
కుమార్తె ఫర్హానా నాజ్‌, కుమారుడు ముజఫర్‌ను పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు అమెరికా సంబంధం చేసింది. మూడునెలల క్రితం కుమారుడు కాలాపత్తర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. తల్లి ఆగ్రహించడంతో కట్నకానుకలు ఏదీ తేకున్నా.. ఆమె సంపాదన నీకే ఇస్తుందని సర్దిచెప్పాడు. 
 
అయితే, కోడలు జీతం తనకివ్వకుండా పుట్టింట్లోనే ఇస్తుండటంతో కుమారుడు, కోడల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. విషయం తెలుసుకున్న ఫర్హానా అమెరికా నుంచి కొత్త దంపతులకు ఫోన్‌ చేసి సర్దిచెప్పింది. వారం పాటు మీ పుట్టింట్లోనే ఉండమని.. తాను అమ్మకు నచ్చచెబుతానని తెలిపింది. 
 
ఈ నెల 11న అమెరికా నుంచి కుమార్తె తల్లికి ఫోన్‌ చేసింది. స్పందనలేకపోవడంతో తమ్ముడికి ఫోన్‌ చేసి తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. అదేరోజు రాత్రి ఏడున్నరకు బంధువులతో కలిసి ఇంటికెళ్లి తలుపు తట్టాడు. స్పందించకపోవడంతో వెనకనుంచి వెళ్లి వంటగదిలో చూడగా కాలిన గాయాలతో తల్లి మృతి చెంది ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుల్తానా పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు.