బాచుపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదారాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణం జరిగింది. దసరా సెలవుల తర్వాత కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తొలుత స్పృహతప్పినట్టుగా సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వచ్చాక చనిపోయిందని చెప్పారు. మృతురాలిని అనూషగా గుర్తించారు.
అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి ఆదివారం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. తల్లిదండ్రులే ఆమెను హాస్టల్‌కు తీసుకొచ్చి వదలి వెళ్లారు. ఆ కాసేపటికే ఆమె స్పృహకోల్పోయిపడిపోయిందంటూ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోను చేసి సమాచారం చేరవేసింది. అప్పటికీ మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ నగరం కూడా దాటలేదు.
తమ కుమార్తె గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే తిరిగి రాగా, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులకు అనూష మృతదేహాన్ని అప్పగించగా, వారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.