శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (13:46 IST)

రూ.10 వేలు ఎరవేసి రూ.2.29 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వ్యక్తుల బలహీనతను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చదువుకున్న వాళ్లు పడి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. సైబర్ నేరగాడి ఉచ్చులో పడి రూ.2.29 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (50) ఫోన్ నెంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు జూలై 19న కేఎస్ఎల్ అఫిషియల్ స్టాక్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేశారు. నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీలో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నానని, షేర్లు క్రయ విక్రయాలపై మెళకువలు నేర్పిస్తుంటారని గ్రూపులోని సభ్యులు తరచూ ఛాటింగ్ చేసేవారు. 
 
విఐపీ ట్రేడింగ్ ప్లాన్లలో చేరితే లాభాలు వస్తాయని అక్టోబరు రెండో తేదీ నుంచి కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్ పేరుతో ఒక వ్యక్తి పోస్టు చేసి ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ ప్లానులో చేరినందుకు తమకు లాభాలు వచ్చాయని గ్రూపు సభ్యుల పేరుతో సందేశాలు పోస్టు చేశారు.
 
దీంతో ఇది నిజమేనని భావించిన ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనిపై పది శాతం లాభం వచ్చినట్లుగా యాప్‌లో మరుసటి రోజు మోసగాళ్లు చూపించారు. దీంతో అతను దఫదఫాలుగా రూ.2.29 కోట్లు బదిలీ చేశాడు. ఈ పెట్టుబడికి రూ.1.10 కోట్లు లాభం వచ్చిందని ఖాతాలో చూపిన సైబర్ నేరగాళ్లు.. పది వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చాడు. 
 
మొత్తం రూ.3.29 కోట్లు విత్ డ్రా చేసుకోవాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలని పేర్కొనడంతో పాటు రకరకాల నిబంధనలు పెట్టడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యగికి అనుమానం వచ్చి తనకు తెలిసిన వ్యక్తులను దీనిపై ఆరా తీశాడు. ఇదంతా సైబర్ నేరగాళ్ల మోసమని తెలియడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.