ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (08:55 IST)

ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి హైదరాబాద్‌కు వచ్చిన లండన్ మహిళ!

victim woman
తన ప్రియుడి మాయమాటలకు ఆకర్షితురాలైన ఓ మహిళ.. కట్టుకున్న భర్తతో పాటు.. ఇద్దరు పిల్లలను వదిలేసి లండన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. విలాసవంతమైన జీవితాన్ని కాదని హైదరాబాద్‌కు వచ్చిన ఆ మహిళ గురించి కట్టుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మహిళను గోవాలో అదుపులోకి తీసుకుని మళ్లీ లండన్ విమాన సర్వీస్‌లో భర్త వద్దకు పంపించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఈ యేడాది ఫిబ్రవరిలో తన తల్లి హైదరాబాద్‌లో మృతి చెందగా.. అస్తికల నిమజ్జనం కోసం ఆమె ఇక్కడికి వచ్చింది. ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక.. ఛార్జీని ఆన్‌లైన్‌లో చెల్లించింది. ట్యాక్సీ డ్రైవర్ శివ ఆమె సెల్‌ఫోను నంబరును సేవ్ చేసుకుని చాటింగ్ ప్రారంభించాడు. 
 
తన మాయమాటలతో ఆమెను తనదారికి తెచ్చుకున్నాడు. అతని మాటలకు ఆమె కూడా ఆకర్షితురాలైంది. ఈ క్రమంలో గత నెల 16వ తేదీన ఆమె భర్త తల్లి మృతి చెందడంతో ఆయన ఒంటరిగా హైదరాబాద్ వచ్చాడు. పిల్లలను వదిలేసి.. ఆమె కూడా సెప్టెంబరు 30వ తేదీన ఎవరికీ చెప్పకుండా.. ప్రియుడి జన్మదిన వేడుక కోసమని హైదరాబాద్ వచ్చేసింది. 
 
అమ్మ ఇంటికి రావడం లేదని పిల్లలు చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్ చేసినా, స్పందన లేదు. దీంతో కంగారుపడి ఆయన లండన్ వెళ్లి ఆరా తీయగా, భార్య హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. మరోసారి సెల్‌ఫోనులో సంప్రదించగా ఆమె నంబరు కలిసింది. ఈ నెల 5వ తేదీన లండన్ రావడానికి టికెట్ తీసుకున్నానని ఓసారి, ఎయిరోపోర్టుకు బయలుదేరానని మరోసారి, ఓ ట్యాక్సీ డ్రైవర్ కిడ్నాప్ చేసి శంషాబాద్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంచాడని ఇంకోసారి నమ్మించింది. 
 
దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త స్నేహితులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి, ఆమెను తీసుకొచ్చి.. లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.