సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

మల్టీప్లెక్స్‌లో సినిమా చూపిస్తామంటూ.. అనాథ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు అనాథ విద్యార్థినిలుపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మల్టీప్లెక్స్‌లో సినిమా చూపిస్తామంటూ నమ్మించి రేప్ చేశారు. 
 
హైదరాబాద్‌లోని ఓ అనాథ విద్యార్థి వసతిగృహంలో ఉంటున్న ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులను కామాంధులు కాటేసిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు వేర్వేరు ఘటనలూ ఏప్రిల్‌లో జరిగాయి. ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో బాధితులిద్దరూ భయంతో ఇటీవలివరకు నోరువిప్పలేదు. 
 
ఈ నెల 3వ తేదీన వసతిగృహం అధికారులకు చెప్పగా వారు పోలీసులకు అదేరోజు రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హుమాయూన్‌నగర్‌ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాల ఆధారంగా ఒక అత్యాచారం కేసును రాంగోపాల్‌పేట పోలీస్‌ ఠాణాకు, మరోదాన్ని రాజేంద్రనగర్‌ పోలీస్‌ ఠాణాకు 'జీరో ఎఫ్‌ఐఆర్‌'గా నమోదు చేసి బదిలీ చేశారు. 
 
రాంగోపాల్‌పేట పోలీసులు ఒక నిందితుడు సురేష్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. మరో కేసులో మైనర్‌ అయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితులిద్దరూ మైనర్లే. 
 
ఈ వసతి గృహంలో ఉండే విద్యార్థినికి కళాశాలలో ఇద్దరు విద్యార్థులు స్నేహితులయ్యారు. వీరు ముగ్గురూ తరచూ కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్‌ 25వ తేదీన ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. సినిమాకు వెళ్దామంటూ ఓ స్నేహితుడు ప్రతిపాదించాడు. దీనికి ఆ యువతి సమ్మతించింది. ఆ తర్వాత ముగ్గురూ అదేరోజు రాత్రి కారులో అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌కు వెళ్లారు. 
 
శీతలపానీయం తాగుదామంటూ చెప్పి ఆమెను ఓ స్నేహితుడు బయటకు తీసుకువచ్చాడు. మాల్‌లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం రాత్రి తోటి విద్యార్థిని ప్రశ్నించినప్పుడూ తనపైనా అత్యాచారం జరిగిందని ఈమె చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.