భార్య సహకరిస్తుంటే మహిళలపై అత్యాచారం.. నిలువు దోపిడీ.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ దంపతులకు కోర్టు సరైన శిక్ష విధించింది. ఒంటరిగా వెళ్లే మహిళలపై అత్యాచారానికి పాల్పడే భార్యాభర్తలకు రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. ఒంటరిగా వెళ్లే మహిళలపై బలవంతంగా లైంగికదాడి చేయడం, ఆ మహిళ ప్రతిఘటిస్తే మాత్రం హత్య చేయడం. ఇందుకు ఆ దుర్మార్గుడుకి కట్టుకున్న భార్య కూడా సహకరించడం. ఇలా సంచలనం సృష్టించిన ఈ భార్యాభర్తల నేరాల పరంపరలోని మూడు కేసుల్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెలువరించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి అలియాస్ రవి(30), మాసనమొల్ల నర్సమ్మ అలియాస్ కురువ నర్సమ్మ భార్యాభర్తలు. వీరు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్ కాలనీలో స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఒంటరి మహిళలను మాయమాటలతో తీసుకెళ్లి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు.
2021 జులై 25న మల్లంపేట్ అడ్డాలో పని కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళ(35)కు కూలీ పని ఉందని చెప్పి బైకుపై తీసుకెళ్లారు. దుండిగల్ ఠాణా పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో ఆమెపై రవి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. భార్య నర్సమ్మ ఆమెను గట్టిగా బంధించగా స్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి ఒంటి మీదున్న ఆభరణాలు దోచుకొని క్రూరంగా హింసించి హత్య చేశారు.
దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డా. కె. పట్టాభిరామారావు శుక్రవారం తీర్పునిచ్చారు. అలాగే, మరో రెండు కేసుల్లో కూడా వీరికి జీవిత కారాగారశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.