ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం ఆమెను వేధిస్తూ తీవ్ర క్షోభకు గురి చేసాడు. అన్నీ అతడే అని అందర్నీ వదిలేసి వచ్చిన ఆ మహిళ అన్నీ భరిస్తూ కాలం వెళ్లదీస్తోంది. భర్త ఉద్యోగం వదిలేసి జులాయిలా ఇంట్లో వున్నా, కుటుంబ భారాన్ని తను ఒక్కతే మోస్తూ నర్సుగా పని చేస్తోంది. కానీ ఆమెపై రోజురోజుకీ అనుమానం పెంచుకున్న అతడి వేధింపులు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇతడి వేధింపులకు తోడుగా అతడి సోదరి కూడా తోడైంది. ఇద్దరూ కలిసి ఆమెను మానసికంగా హింసించడం ప్రారంభించారు. ఫిబ్రవరి 2న తన ఆడపడుచే ఆమె పాలిట మృత్యువైంది. మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఆమె మత్తులోకి జారుకోగానే ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హనుమకొండ జిల్లాలోని పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఐతే వీరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో చిన్నకుమార్తె శిరీషను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నాడు. ఐతే శరీష వినయ్ అనే వ్యక్తిని ప్రేమించాననీ, అతడినే పెళ్లి చేసుకుంటానని ప్రొఫెసరుకి చెప్పింది. అతడితో పెళ్లి వద్దని ప్రొఫెసర్ ఎంతగా వారించినా శిరీష్ అతడినే 2016లో పెళ్లి చేసుకుంది. వీరికి 2019లో ఓ పాప జన్మించింది. వీరు మలక్ పేటలో కాపురం వుంటున్నారు.
ఐతే పెళ్లయిన సంవత్సరం నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు వినయ్. నిత్యం ఆమెను వేధిస్తున్నాడు. హఠాత్తుగా ఈనెల 2న ఉదయం 10 గంటలకు వినయ్ తన భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసి శిరీష గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం ఇచ్చాడు. ఈ షాకింగ్ వార్తతో స్వాతి ఒకింత ఆందోళన చెందింది. ఐతే ఆరోగ్యంగా వుండే తన సోదరి గుండెపోటుతో చనిపోవడం ఏంటని, విషయాన్ని మేనమామకి చెప్పింది. దాంతో అతడు శిరీష ఇంటికి ఫోన్ చేసి తాము వచ్చేవరకూ మృతదేహాన్ని అక్కడే వుంచాలని చెప్పాడు.
కానీ అదేమీ పట్టించుకోని వినయ్, అతడి సోదరి మృతదేహాన్ని సొంతగ్రామానికి తరలించి అంత్యక్రియలు ముగించేయాలని చూసారు. కానీ శిరీష మేనమామ అతికష్టమ్మీద అంబులెన్స్ డ్రైవరుకి ఫోన్ చేసి మృతదేహాన్ని వెనక్కి రప్పించాడు. పోస్టుమార్టం చేయగా... శిరీషను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. దీనితో శిరీష భర్త వినయ్‌తో పాటు అతడి సోదరిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.