మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (11:05 IST)

ప్రియురాలిని దూరం చేశారన్న అక్కసుతో జంట హత్యలు చేసిన ప్రియుడు!! (Video)

murder
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జంట హత్యలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను దూరం చేయడాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలోని చెన్నరావుపేట మండలం 16 చింతల తండాలో దారుణం జరిగింది ప్రేయసిని దూరం చేశారన్న అక్కసుతో అర్థరాత్రి ప్రియురాలి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా ప్రియుడు దాడి చేశాడు. ఈ దాడిలో అక్కడికక్కడే ప్రియురాలి తల్లి సుగుణ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి బానోతు శ్రీను మృతి చెందాడు. భార్యకు, భార్య తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఒకే సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రియురాలు, ఆమె సోదరుడు అనాథలయ్యారు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. 16 చింతల తండాకు చెందిన దీపికకు మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు అలియాస్ బన్ని అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లిపోయారు. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిపై ఆగ్రహంతో ఉన్న బన్ని బుధవారం రాత్రి నిద్రిస్తున్న వారిపై దాడి చేశాడు.
 
అర్థరాత్రి యువతి కుటుంబ ఆరుబయట నిద్రిస్తుండగా తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి బానోత్ సుగుణ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీపికతో పాటు ఆమె సోదరుడు మదన్ పరిస్థితి విషమంగా ఉంది. మొదట వారిని నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన నాగరాజు పరారీలో ఉన్నాడు.