ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (10:36 IST)

యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు అరెస్టు... మరికొందరి కోసం గాలింపు

arrest
తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఓ చిన్నారి వీడియోపై అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో అతడు వీడియో చాట్ చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీనటుడు సాయి ధర్మ్ తేజ్ తన ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు. 
 
ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరికి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణీత్ హనుమంతుపై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
 
బుధవారం బెంగళూరులో ప్రణీత్ హన్మంతును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడన్న అభియోగంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు ప్రణీతను హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.