పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!
పలువురు అమ్మాయిలు ప్రేమవలలో చిక్కుకుని మోసపోతున్నారు. దీంతో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో అతని ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..
అస్సాంకు చెందిన సుల్తానా బేగం (26) అనే యువతి సిద్ధిఖ్ నగర్‌లోని ఓ హోటల్‍లో వెయిటర్‌గా పని చేస్తుంటే, ఆమెకు అక్కడే హోటల్ యాజమాన్యం బసవసతి కల్పించింది. మరో హోటల్‌లో వెయిటర్‌గా పని చేసే కోల్‌కతాకు చెందిన సయ్యదుల్ షేక్ (29) అనే వ్యక్తి అంజయ్యనగర్ బంజారా బస్తీలో ఉంటున్నాడు. అతనితో సుల్తానాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలంగా ప్రేమించుకోసాగారు. అయితే, పెళ్లి ప్రస్తావన తీసుకునిరాగానే ముఖం చాటేశాడు. పైగా ఆమె ఫోను నంబర్‌ను సైతం బ్లాక్ చేశాడు.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో స్నేహితుల ఫోన్‌తో తన ప్రియుడుకి కాల్ చేసింది. తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని తనను వివాహం చేసుకోవాలని ప్రాధేయపడగా, అతను నిరాకరించాడు. దీంతో ఆమె ఉదయం 5 గంటల సమయంలో అతడుంటున్న భవనానికి వచ్చి ఐదో అంతస్తుపైకి చేరుకుని అక్కడ నుంచి కిందకు దూకి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.