బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:21 IST)

మూడు ముళ్ళు వేసిన వరుడిని పెళ్ళిపీటలపై అరెస్టు చేసిన పోలీసులు!!

child marriage
వధువు మెడలో మూడు ముళ్లు వేసిన కొన్ని ఘడియలు కూడా ముగియకముందే వరుడుని పెళ్లిపీటలపైనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా టి ఎమ్మిగనూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టి.ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడికి చెళ్లకెర తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్‌కు తెలిసింది. ఆయన పోలీసులను వెంటబెట్టుకొని ఆ గ్రామం చేరుకున్నారు. వివాహం వరుడి గ్రామం టి. ఎమ్మిగనూరులో జరుగుతోందని తెలుసుకొని ఆక్కడికి వెళ్లారు. 
 
ఆ పాటికే వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేశారు. అధికారులు, పోలీసులు బాలిక చదివే పాఠశాలకు వెళ్లి ఆమె జన్మదిన వివరాలు సేకరించారు. బాలికకు 17 సంవత్సరాలు 2 రోజుల వయసున్నట్లు నిర్ధారించారు. చట్టం ప్రకారం పోలీసులు వరుడు రంగస్వామిని అదుపులోనికి తీసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. హొళల్కెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.