మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 అక్టోబరు 2025 (10:19 IST)

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

murder
తాడేపల్లిగూడేనికి చెందిన మాడుగుల సురేశ్‌(25) అనే వ్యక్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తన భార్య శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో సురేశ్‌ను హతమార్చేందుకు తణుకు పట్టణానికి చెందిన న్యాయవాది తిర్రే సత్యనారాయణ రాజు కుట్రపన్నాడని, దీనికి తన సన్నిహితులు నలుగురి సహకారం తీసుకున్నట్టు తేలింది. 
 
గత నెల 23వ తేదీన ఉదయం శిరీష ఇంటి నుంచి బయటకు వచ్చిన సురేశ్‌ను సత్యనారాయణరాజు, నలుగురు సహచరులు కలిసి కిడ్నాప్‌ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చి మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టారు. అనంతరం న్యాయవాది సోదరుడు విజయకృష్ణకు చెందిన కారులో చించినాడ తీసుకెళ్లి వంతెనపై నుంచి గోదావరిలో పడేశారు. 
 
అదృశ్యమైన సురేశ్‌ ఆచూకీ తెలియకపోవడంతో గత నెల 25న అతని సోదరి ప్రశాంతి తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది తిర్రే సత్యనారాయణ రాజుపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. అతని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు హత్యకు పాల్పడిన నిందితుల కోసం రాత్రీపగలూ శ్రమించారు. చివరికి న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య ఉదంతం వెలుగు చూసింది. అతని మృతదేహాన్ని అదృశ్యమైన పది రోజుల అనంతరం కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వద్ద గోదావరిలో పోలీసులు గుర్తించారు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితులు న్యాయవాది తిర్రే సత్యనారాయణ రాజుతో పాటు భార్య శిరీష, అతని సన్నిహితులు వల్లూరి పండుబాబు అలియాస్‌ పండు, సరెళ్ల సాయికృష్ణ అలియాస్‌ సాయి, బంటు ఉదయ్‌కిరణ్‌ అలియాస్‌ బన్నీ, గంటా ఫణీంద్ర బాబు అలియాస్‌ ఫణిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మృతదేహాన్ని తరలించడానికి వినియోగించిన కారు యజమాని విజయకృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.