శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (10:12 IST)

అక్రమ బంధానికి అడ్డుగా ఉందనీ.. పంజాగుట్ట చిన్నారిని అమ్మే చంపేసిందా...

ఇటీవల హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ సర్కిల్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా ఇది హత్యగా తేల్చారు. ఈ కేసులో చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. ఇద్దరు కలిసి ఈ చిన్నారిని హత్య చేసినట్టు తేల్చే కీలక ఆధారాలను సేకరించారు. దీంతో ఆ ఇద్దరినీ రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీస్ వర్గాల సమాచారం మేరకు... బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని సమాచారం. ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించారు. 
 
కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించపోవడంతో ఒక ప్రకటన రూపొందించి తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ చిన్నారి చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా బుధవారం రాత్రి కీలకాధారం లభించింది. 
 
నిందితులు అజ్‌మేర్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. బాలిక తండ్రి చనిపోవడంతో ఆమె.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, వారు యాచకులని పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో రాజస్థాన్ వెళ్లిన పోలీసులు.. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.