ఆన్ లైన్ అప్పుల బాధ: భార్యాపిల్లలకు విషమిచ్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగీరథ్‌పురాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి సాగర్‌లో నివాసముంటున్న అమిత్ యాదవ్ మంగళవారం ఉదయం నుంచి వెలుపలికి రాలేదు. కుటుంబ సభ్యుల అలికిడి లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. భగీరథపురాలో నివశిస్తున్న అతని అత్తమామలకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. లోపల అమిత్ యాదవ్ ఉరి వేసుకుని ఉన్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు, అతడి భార్య మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నారు.
డిసిపి ధర్మేంద్ర మాట్లాడుతూ.. అమిత్ ఓ ప్రైవేట్ టెలీకమ్యూనికేషన్ టవర్ కంపెనీలో టెక్నికల్, సెటప్ పనులు చేసేవాడు. అతని అత్తమామలు కూడా అతడికి సమీపంలో ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందురోజు అతడు ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని వచ్చాడు. కాగా సంఘటన స్థలం నుండి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రైవేట్ అప్పులు ఇచ్చే యాప్ లనీ, వారి బెదిరింపులతో ఏం చేయాలో తోచక ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇరుగుపొరుగు వారి ప్రకారం, అమిత్ ప్రవర్తన అందరితో చాలా బాగుండేదనీ, చుట్టుపక్కల ఎవరితోనూ వివాదం లేదని తేలింది.