గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (08:55 IST)

ప్రేమించలేదని పురుగుల మందు తాగించి యువతి హత్య.. ఎక్కడ?

murder
ప్రేమించలేదన్న కోపంతో ఓ యువతికి పురుగుల మందు తాగించి హత్య చేసిన దారుణ ఘటన తెలంగాణా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలోని అసిఫాబాద్ జిల్లా వెంకట్రావ్ పేటకు చెందిన బూడే దీప (19) అనే యువతి ఇంటర్ విద్యాభ్యాసం చేసింది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటూ కూలీపనులకు వెళుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటుంది. 
 
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్‌ ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ దీప వెంట పడుతూ వేధిస్తున్నాడు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం లొంగలేదు. దీంతో ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని, కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టసాగాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం దీప కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా... సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడిన కమలాకర్‌.. తనను ప్రేమించకుండా వేరే వాళ్లతో మాట్లాడుతున్నావంటూ ఆమెను కొట్టాడు. అనంతరం అక్కడున్న పురుగు మందును బలవంతంగా ఆమె నోట్లో పోసి పారిపోయాడు. 
 
బాధితురాలు బయటకు వచ్చి కాపాడాలంటూ చుట్టుపక్కల వారిని కోరగా.. వెంటనే సిర్పూర్‌(టి) ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.