శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2025 (09:21 IST)

కోడలిని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టారు.. బొందపెట్టిన స్థలంపైనే పొయ్యిపెట్టి పిండివంటలు చేశారు..

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ తండాలో దారుణం జరిగింది. అత్తమామలు, ఆడపడుచు కలిసి ఇంటి కోడలిని చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఆపై బొందపెట్టిన స్థలంపైనే పొయ్యి పెట్టి పిండివంటలు చేసుకున్న అమానవీయ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ తండాలోని భూపతి అంజయ్య ఇంటిలో గత కొన్ని నెలలుగా కాటి గోపి అతని భార్య నాగమణి, తల్లిదండ్రులు లక్ష్మి, రాములు, ఆడపడుచు దుర్గ, బావ మహేందర్‌తో కలిసి ఉంటున్నాడు. కాటిగోపి నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. కూలీ పనులతో పాటు యాచక వృత్తిలో ఉన్నారు. నాగమణిని కొన్ని నెలలుగా భర్త గోపి వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. 
 
ఈ క్రమంలోనే భర్త గోపి తల్లిదండ్రులు, ఆడపడుచు, బావతో కలిసి భార్యను ఈనెల 13న హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం ఇంటి ఆవరణలోనే నాగమణి మృతదేహాన్ని బొందపెట్టి ఆ రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. ఈ నెల 13న ఇంటి నుంచి అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఇంటి ఓనర్ భూపతి అంజయ్యకు ఫిర్యాదు చేశారు. 
 
శుక్రవారం అంజయ్య ఇంటి వద్దకు చేరుకుని పరిశీలిస్తుండగా గోతి తీసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబాబాద్ పట్టణ పోలీసులు క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. నాగమణిని హత్య చేసి ఇంటి పక్కనే పూడ్చివేసి.. బొందపెట్టిన స్థలంలోనే పొయ్యి ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాగమణి హత్యకు కారణాలేంటి..? ఎన్ని రోజుల క్రితం హత్య జరిగింది ? ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు? అనే విషయాలను కనుగోనేందుకు పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.