బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (11:26 IST)

సూసైడ్ లేఖ రాసిపెట్టి... ఒకే గదిలో ఉరేసుకున్న ఇద్దరు విద్యార్థినిలు...

girl students
భువనగిరి యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఎస్సీ బాలిక హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏతప్పూ చేయని తమపై నిందలు మోపుతూ దూషిస్తున్నారంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి, వారిద్దరూ ఒకే గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన ఇద్దరు బాలికలు (15) వసతి గృహంలో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం వసతిగృహానికి వచ్చారు. తర్వాత వసతిగృహంలో నిర్వహించే ట్యూషన్‌కు హాజరుకాలేదు. ట్యూషన్ టీచర్ పిలవగా.. తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకొని ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్‌ను రప్పించి.. ఇద్దరినీ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
 
ఈ సంఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి' అని ఆ లేఖలో రాసి ఉంది. 
 
హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్‌ను.. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్ఐ నాగరాజు, డీఈవో నారాయణ రెడ్డి విచారిస్తున్నారు. వసతిగృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో తెలిపారు. ఈ బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.