గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (11:03 IST)

కన్నతండ్రిని కడతేర్చి.. ఇంటిలోనే పాతిపెట్టిన కుమారులు.. 30 యేళ్ల తర్వాత...

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులు కన్నతండ్రిని కడతేర్చారు. శవాన్ని బయటకు తీసుకెళితే అందరికీ తెలిసిపోతుందని భావించిన ఆ కిరాతక తనయులు.. తమ ఇంటిలోనే పాతిపెట్టారు. ఈ విషయం ఇపుడు వెలుగులోకి రావడంతో 30 యేళ్ల తర్వాత అస్థిపంజరంను వెలికి తీశారు. మూడో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాథ్రాస్‌కు చెందిన బుధ్‌ సింగ్‌ 1994 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై అతడి కుమారుడు పంజాబీ సింగ్‌ ఇటీవల స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి తండ్రిని చంపి ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టారని ఆరోపించాడు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్లు అని చెప్పాడు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఆ ఇంట్లో తవ్వకాలు చేపట్టగా ఓ అస్థిపంజరం లభ్యమైంది. దానికి పోస్టుమార్టంతోపాటు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు.
 
అయితే వ్యవసాయం చేసుకునే బుధ్‌ సింగ్‌కు నలుగురు కుమారులు. సోదరుల మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. మూడు దశబ్దాల క్రితం తండ్రికి, తన అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాలు మాట్లాడటం వల్ల ఆ ఇద్దరు సోదరులు పంజాబీ సింగ్‌ను బెదిరించారు. దీంతో వారిపై సింగ్​కు అనుమానం వచ్చింది. తండ్రి అదృశ్యమవడానికి వారే కారణమని భావించాడు. వెంటనే ఇద్దరు సోదరులపై ఫిర్యాదు చేయడంతో డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.