శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (10:12 IST)

అలుపెరుగని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ జీవితం...

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(94) మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఇకలేరనే వార్తను ఎయిమ్స్ వైద్యులు గురువారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ప్రకటించారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(94) మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఇకలేరనే వార్తను ఎయిమ్స్ వైద్యులు గురువారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ప్రకటించారు. వాజపేయి మరణవార్తతో బీజేపీతో పాటు... దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులంతా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, అటల్ జీ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే..
 
భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924వ సంవత్సరంలో గ్వాలియర్‌‍లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా కళాశాలలో చేరి హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడయ్యారు. ఎంఏ రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందారు. 
 
1939లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44లలో పదాధికారుల శిక్షణా శిబిరానికి హాజరైనారు. 1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న 'రాష్ట్రధర్మ' (హిందీ మాసపత్రిక), 'పాంచజన్య' (హిందీ వారపత్రిక) పత్రికలు, 'స్వదేశ్', 'వీర్ అర్జున్' దినపత్రికలలో విలేకరిగా పని చేశారు. 
 
1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో పనిచేయాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని ఆర్ఎస్ఎస్ నియమించింది. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కుడిభుజంగా వాజపేయి ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత వాజపేయిపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్‌ కృష్ణ అద్వానీలతో కలిసి పార్టీని జాతీయస్థాయికి ఎదిగేలా చేశారు.
 
వాజపేయి మొదటిసారి రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 3, 9 లోక్‌సభలకు మినహా 14వ లోక్‌‌సభ వరకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్‌లను కలుపుకొని వాజపేయి 1980లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించారు. 1980 నుండి 1986 వరకు ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. 
 
1996లో తొలిసారిగా ప్రధానమంత్రి అయినా.. అది 13 రోజులకే పరిమితమైంది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విఫలమై సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. దీంతో వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా 13 నెలలు పాలించారు. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు కొనసాగారు. 
 
అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' పురస్కారాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2015 మార్చి 27న వాజపేయికి 'భారతరత్న' ప్రదానం చేశారు.