గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:56 IST)

అభ్యర్థిని ప్రకటించలేదు గానీ.. తామే గెలుస్తామని బీజేపీ హడావుడి!

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే తామే గెలుస్తామని హడావుడి చేస్తోన్న బిజెపి ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. తిరుపతి ఉపఎన్నిక కోసమే ఇటీవల బిజెపి అగ్రనేతలతో 'రాయలసీమ' డిక్లరేషన్‌ విడుదల చేసిన 'బిజెపి' నేతలు అభ్యర్థి విషయంలో తమ మదిలో ఏముందో ప్రకటించడం లేదు. ఎస్సీ వర్గానికి చెందిన గట్టి నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఎవరైతే గట్టిపోటీ ఇస్తారో.. వారినే అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు ఉంటే వారిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఎన్నికకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. పార్టీ నేతలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన క్రియాశీలక సభ్యులు 'తిరుపతి, నెల్లూరు'ల్లో మకాం వేసి వ్యూహరచన చేస్తున్నారు. 
 
ఇటీవల తెలంగాణలోని 'దుబ్బాక' నియోజకవర్గంలో సాధించినట్లు ఇక్కడా విజయం సాధించి ఆంధ్రాలోనూ తమదే అధికారమని చాటాలని బలంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన 'బిజెపి' ఇప్పుడు బలంగా ఉన్న అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని చిత్తుచేయాలనే ధ్యేయంతో ఉన్నారు. అయితే ఇది అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాకపోయినా.. బలమైన అభ్యర్థితో అది సాధిస్తామని చెబుతున్నారు. 
 
 
ప్రస్తుతానికైతే పార్టీ నలుగురు అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు తిరుపతి ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. వారిలో మాజీ ఐఎఎస్‌ దాసరి శ్రీనివాసులు ఒకరు కాగా మరొకరు తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీనటుడు, మాజీ మంత్రి 'బాబూ మోహన్‌', గతంలో టిడిపిలో మంత్రిగా పనిచేసి తరువాత బిజెపిలో చేరిన 'రావెల కిశోర్‌బాబు' ఉన్నారు. 
 
కాగా 'తిరుపతి' ప్రాంతానికి చెందిన డాక్టర్‌ శ్రీహరి కూడా రంగంలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరు కాకుండా ఎస్సీ వర్గానికి చెందిన మరికొంత మంది పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పైన పేర్కొన్న నలుగురిలో 'తెలంగాణ' ప్రాంతానికి చెందిన 'బాబూ మోహన్‌'కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణకు చెందిన వాడైనా ఆయనకు ఆంధ్రా ప్రజలతో చిరకాల పరిచయం ఉంది. 
 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడం, సినీనటుడు కావడం ఆయన ప్లస్‌పాయింట్లు. స్థానికేతరుడికి టిక్కెట్‌ ఇస్తారా.. అంటే అది అనుమానమే. మాజీ ఐఎఎస్‌ దాసరి శ్రీనివాసులు తనకు టిక్కెట్‌ వస్తుందని చాలా ఆశాభావంతో ఉన్నా ఆయన వయస్సు ఆయనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు. 
 
మరోవైపు మాజీ మంత్రి 'రావెల కిశోర్‌బాబు'కు కూడా అవకాశాలు లేవు. ఆయన ఇటీవలే పార్టీలో చేరడం, నిలకడ లేకపోవడం, ఆయన కుమారులు వివాదాస్పదులు కావడం వంటి కారణాలతో ఆయనకు కూడా అవకాశాలు తక్కువే. డాక్టర్‌ శ్రీహరి పేరును అధిష్టానం పరిశీలించవచ్చు. వీరు కాకుండా ఎస్సీ పారిశ్రామికవేత్తల్లో యువకులైన వారికి అవకాశాలు రావచ్చు. అయితే ఇప్పట్లో అభ్యర్థిని ప్రకటించమని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ సీనియర్‌నేతలు చెబుతున్నారు. మొత్తం మీద నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ గెలుస్తామనే ధ్యేయంతో అభ్యర్థిపై కసరత్తులు చేస్తోంది.