రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్సను అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుని, వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా విశాఖలో రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారికి అండగా నిలబడటమే కాకుండా క్షతగాత్రులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.