ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (14:50 IST)

జాతీయ హీరోగా కేసీఆర్... తదుపరి ఆయన ప్లాన్ ఏంటంటే?

దేశానికి నాయకత్వం వహిస్తానంటూ తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒకే ఒక ప్రకటనతో ఆయన జాతీయ స్థాయి హీరోగా మారిపోయారు. ఆయన ప్రకటన చేశాక.. అంతటితో మిన్నకుండిపోలేదు.

దేశానికి నాయకత్వం వహిస్తానంటూ తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒకే ఒక ప్రకటనతో ఆయన జాతీయ స్థాయి హీరోగా మారిపోయారు. ఆయన ప్రకటన చేశాక.. అంతటితో మిన్నకుండిపోలేదు. తన తదుపరి కార్యాచరణను కూడా ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఆయన త్వరలో అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రిటైర్డ్ ఆర్థిక కార్యదర్శులు, కార్మికసంఘాలతో సమావేశంకానున్నారు. 
 
ఇందుకోసం ఆయన హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులలో సమావేశాలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తూ దేశానికి సేవ చేయడానికి సిద్ధమే అన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడేకాకుండా ఇక్కడికి వచ్చాక కూడా పలు పార్టీల నేతలతో ఫోన్‌లో సంప్రదింపులు ప్రారంభించారు. త్వరలో మరోసారి ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఢిల్లీ టూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు, ఇతర పార్టీల నేతలు, వామపక్షాల నేతలను కలవనున్నారు. స్వయంగా వెళ్లి ఆయా పార్టీల నేతలతో చర్చించాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీలు కుదరకపోతే ఆయా పార్టీల ఎంపీలను తన వద్దకు ఆహ్వానించి చర్చించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను వ్యతిరేకించే పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేలా జాతీయస్థాయిలో ప్రాంతీయ, వామపక్ష పార్టీలను సమన్వయం చేయాలనుకుంటున్నారు. 
 
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న నేపథ్యంలో వాటిని రోల్‌మోడల్‌గా అజెండాలో ప్రస్తావించనున్నారు. కోటి ఎకరాలను సాగునీరు, ప్రతీఇంటికి నల్లానీరు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ అమలు చేస్తుంటే ఇలాంటివి జాతీయ స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండూ తామూ రూపొందించే జాతీయ అజెండాలోని అంశాలను ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితి కల్పించాలని కేసీఆర్ లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అదేసమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా కేసీఆర్ కదలికలపై ఓ కన్నేసి వుంచాయి.