సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:42 IST)

ఆయన 'అనంత చంద్రుడు'... జిల్లా నుంచి ఢిల్లీ వరకూ ప్రశంసలందుకున్న గంధం చంద్రుడు ఐఏఎస్

నీవు ఉన్నా లేకపోయినా కాలం ఆగదు.. కాని మనం చేసే మంచి పనులను.. మనం లేకపోయినా కాలం మాత్రం మరవదు.... ఇదీ గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు. ఇలా ఆలోచించడం మనిషికి చాలా కష్టం. కాని ఆ అధికారి మాత్రం ఆ మాటలను బాధ్యతగా తీసుకున్నారు. జిల్లాకు వచ్చాం.. అందరిలానే పని చేసి వెళ్లిపోదాం అని అనుకోలేదు. మనం ఉన్న రోజుల్లో చేసే మంచి పనులు వచ్చే వారికి మార్గదర్శకంగా ఉండాలని అనుకున్నారు. అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా, వినూత్నంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న పనులు ప్రజలను ఒక నిమిషం ఆపి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంతేకాదు.. జిల్లా నుంచి ఢిల్లీ వరకు ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ అధికారి.. ఆయన చేస్తున్న పనులు ఏంటి?
 
ఒక్క రోజులో మార్పు సాధ్యం కాదు.. సెంచరీ కొట్టాలన్నా ఒక్క పరుగు నుంచే ప్రారంభం కావాలి... ఇదంతా దేనికంటే.. సమాజంలో మార్పు కోసం ఎంతోమంది నాయకులు, అధికారులు కృషి చేస్తున్నారు. కాని మార్పు రాలేదని నిరాశతో ప్రజలు ఉన్నారు. ఇక మార్పు చేయాల్సిన వారు తమకెందుకు అన్న ధోరణితో ముందుకెళ్తున్నారు. కాని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అలా అనుకోలేదు. ఆయన తొలిసారిగా జిల్లా కలెక్టర్ అయ్యారు.
 
ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఒకసారి చూస్తే.. అట్టడుగు పేద కుటుంబానికి చెందిన గంధం చంద్రుడు ఎంతో కష్టపడి చదివారు. తన జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆయన ఆగిపోలేదు. బాగా చదివి టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించారు. అక్కడితో ఆయన సంతృప్తి చెందలేదు. తన గమ్యం ఇది కాదని భావించి మరింత కష్టపడ్డారు. ఐఏఎస్ లాంటి ఉన్నతమైన శిఖరానికి చేరుకున్నారు. ఆ తరువాత పలుచోట్ల పని చేసి జిల్లా కలెక్టర్‌గా అనంతపురం వచ్చారు. ఆయన కూడా అందరిలా వచ్చి ఏదో పని చేసుకుని వెళ్దాం అనుకోలేదు. ఏదో ఒక మార్పు చూపించాలనుకున్నారు. ఆయన జిల్లాకు వచ్చిన సమయంలో మొదట కనిపించింది.
 
నగరం అపరిశుభ్రంగా ఉండటం.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉండటం. మార్పు ఇక్కడి నుంచి మొదలు కావాలనుకున్నారు. ఆయన స్థాయికి కార్పొరేషన్ అధికారులను మందలించి వదిలేయచ్చు.. కానీ ఆయన అలా చేయలేదు. ఐఏఎస్ హోదాలో ఉన్నా.. చీపురు పట్టారు. రోడ్లు ఊడ్చారు. ఆయన చేస్తున్న పని చూసి మొత్తం వ్యవస్థ కదిలింది. అప్పుడే "మన అనంత- సుందర అనంత" కార్యక్రమం రూపుదిద్దుకుంది. నగరంలో ఎక్కడా అపరిశుభ్రంగా లేకుండా చేయడమే కాదు మొక్కలు నాటడం చేశారు. అంతేనా.. జిల్లా సంస్కృతిని చాటేలా నగరంలోని ప్రధాన వీధుల మీదుగా అందమైన చిత్రాలు వేయించారు. ఇప్పుడు అనంత నగరంలో ఏ గోడను అడిగినా చెబుతాయి ఆయన చేసిన మార్పు.
 
అప్పుడే మొదలైంది కలెక్టర్ గంధం చంద్రుడు పయనం... జిల్లాలో కొన్ని వందల ఏళ్ల నుంచి ఒక సాంఘిక దురాచారం ఉంది. ఎవరైనా అధికారులు వద్దకు వెళ్లేటప్పుడు పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడటం వంటివి ఉన్నాయి. ఇలాంటి దుస్సప్రదాయాన్ని రూపుమాపేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు సెల్ఫ్ రెస్పెక్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎవరైనా అధికారుల వద్దకు వచ్చినప్పుడు పాదరక్షలు వదిలేయడం కానీ, చేతులు కట్టుకుని నిలబడటం చేయవద్దని తెలియజేసే పోస్టర్లు ప్రతి కార్యాలయంలో ఉండేలా చేశారు. దీనివలన ఆ సంస్కృతి చాలా వరకు తగ్గింది.
 
ఇంతలో కరోనా మొదలైంది. జిల్లా జనాభా ఎక్కువ.. కేసులు ఎక్కువ.. కాని ఆయన మాత్రం వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకున్న చర్యలు రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిలిపాయి. ఎక్కడ టెస్టులు చేయాలి.. ఎక్కడ, ఎవరికి వైద్య సేవలు అందాలి... ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై రేయింబవళ్లు శ్రమించారు. జిల్లాలో టీంలను సమర్థవంతంగా నడిపి చాలా సార్లు కరోనా కట్టడిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపించారు. ఇక ఆయన చూసిన సామాజిక రుగ్మతల్లో మరోకొటి బాలికల చదువులను మధ్యలోనే ఆపేయడం. అలాగే వారిపై వివక్ష. గ్రామీణ ప్రాంతాల బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం. వీటన్నింటినీ మార్చడం ఒక్క కలెక్టర్ వలన మాత్రమే అవుతుందా..కాదనుకుంటాం.. కాని.. ఆయన అడుగు ముందుకేశారు. ఆయన చేపట్టిన కార్యక్రమం దేశంలో అందర్నీ కదిలించింది. 
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు అన్న వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో చదువుకునే బాలికలను ఒక్కరోజు అధికారిగా మార్చడం. అంటే జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామాల్లో ఉన్న చిన్న స్థాయి అధికారి వరకు ఒక్కరోజు బాలికలను అధికారులుగా మార్చడం. అంతేకాదు వారి దృష్టికి వచ్చిన సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపితే వాటిని అమలు చేసేలా కూడా ఆయన ఆదేశిలిచ్చారు. కలెక్టర్ చేసిన ఈ పని ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఆలోచింపజేసాయి. అలాగే కేంద్ర మంత్రి, ప్రధాని మోదీ నుండి ప్రసంశలు అందుకునేలా చేశాయి. బాలికల్లో ఆత్మస్థైర్యం, ప్రోత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమాన్ని మనమెందుకు చేయకూడదన్న ఆలోచన రగిలించింది.
 
విద్యార్థుల చదువుల విషయంలో మరిన్ని మార్పులు తెచ్చేందుకు ఆయన బడిబాట పట్టారు. కరోనా విషయంలో విద్యార్థులకు పాఠాలు నేర్పారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి.. అక్కడ విద్యార్థులకు ఎలాంటి భోజనం అందుతోందని పరిశీలించేందుకు విద్యార్థులతో కలసి భోజనం చేస్తుంటారు. అలాగే వారితో వసతి గృహంలో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇక కలెక్టర్ అంటే నాలుగు గోడల మధ్య కూర్చుని అధికారులకు ఆదేశాలివ్వడం కాదు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన పల్లె బాట పట్టారు. కలెక్టర్ నేరుగా గ్రామాలకు వెళ్లడం.. అది కూడా గ్రామస్థులంతా పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సాయంత్రం వేళ ఆయన గ్రామాలకు వెళ్తున్నారు.
 
గ్రామంలో రచ్చబండపై కూర్చుని సమస్యల గురించి చర్చించడం వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలివ్వడం. అలాగే ఇంటింటికీ వెళ్లి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయన్నది తెలుసుకున్నారు. అక్కడితో ఆగకుండా మారుమూల గ్రామాల్లో పల్లె నిద్ర చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేస్తుంటారు. కానీ కలెక్టర్ ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అంతే.. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కరవు జిల్లాలో సమర్థవంతంగా అమలు చేశారు. దేశంలో ఎక్కువ పని దినాలు కల్పించిన ప్రాంతంగా రికార్డులకెక్కించారు. అంతేకాదు కూలీలతో కలసి పనులు చేసి వారి కష్టనష్టాలు తెలుసుకోవడం గతంలో ఏ కలెక్టర్ చేయలేదనే చెప్పాలి. కూలీలకు కరువు పని ద్వారా డబ్బులు వచ్చేలా చేసి ఆకలి చావులు అరికట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
జిల్లాలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య మార్కెటింగ్. ఉద్యాన హబ్‌గా ఉన్న అనంతపురం జిల్లాలో రైతులు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు పండ్లను ఎగుమతి చేస్తుంటారు. అయితే వారు పండ్లను ఎగుమతి చేసేందుకు వారం రోజుల సమయం పడుతోంది. ఈ పరిస్థితి గుర్తించిన కలెక్టర్, ఎంపీ తలారి రంగయ్యతో కలసి కిసాన్ రైలు వచ్చేలా చేశారు. కిసాన్ రైలు మూడుసార్లు సమర్థవంతంగా నడిపించి ఆయన అన్నదాతలకు బాసటగా నిలిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థల విషయంలో కలెక్టర్ చేపట్టిన సడెన విజిట్స్ ఎంతో మార్పు తీసుకొచ్చింది.
 
కలెక్టర్ ఎప్పుడు ఏ సచివాలయానికి వెళ్తారో తెలియదు. ఎక్కడ ఏ రికార్డు పరిశీలిస్తారో తెలియదు.. అందుకే అంతటా అలర్ట్ అన్న రీతిలో చేస్తున్నారు. గ్రామాల్లో సచివాలయాలు అన్ని రకాల సేవలందించాలన్న ఉద్దేశ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు.. తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పలు శాఖల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే.. మొదట వార్నింగ్‌లు ఉంటాయి. అప్పటికీ మారకపోతే.. కలెక్టర్‌లో మరో కోణాన్ని చూస్తారు. ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు.
 
కలెక్టర్ గంధం చంద్రుడు చేసిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు..
జిల్లాలో సెల్ఫ్ రెస్పెక్ట్ పోస్టర్ ద్వారా జిల్లాలో ఉన్న ఒక విధమైన వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టారు.
 
వేరుసెనగ, పప్పుశెనగ విత్తన పంపిణీని ఎంతో సమర్థవంతవంగా నిర్వహించారు. గతంలో లాఠీఛార్జిలు, తోపులాటలు, క్యూలైన్లలో రైతులు ప్రాణాలు పోవడం కూడా చూశాం. కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ గ్రామానికి అక్కడే వేరుసెనగ విత్తనం అందేలా చేశారు. ఇది సీఎంతో సహా అందరి ప్రశంసలు అందుకుంది.
 
హెచ్చెల్సీ, హంద్రీనీవా నీటి విషయంలో ప్రజా ప్రతినిధులు, రైతులు గొడవలు పడ్డ సందర్భాలు గతంలో చూశాం. కాని ఈసారి అలాంటివి మచ్చుకు ఒక్కటి కూడా కనిపించకుండా కలెక్టర్ అన్ని ప్రాంతాలకు నీరు అందేలా సంబంధిత అధికారులను గైడ్ చేశారు.
 
రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన చిత్రావత్రి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు పరిహారం విషయాన్ని ఎంతో చాకచక్యంగా డీల్ చేశారు. మొదట్లో అక్కడ వివాదాలు వచ్చినా.. తరువాత ఆయన లెక్కలతో సహా చూపించి వాటికి పరిష్కారం చేయడమే కాకుండా బాధితులకు పరిహారం అందేలా చూశారు.
 
కరోనా సమయంలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ల్యాబ్ లు, ఆసుపత్రులపై కొరడా జులిపించారు. ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా సహించేది లేదని నిస్పష్టంగా చెప్పారు.
 
కరోనా రోగుల పట్ల వివక్ష చూడకుండా వారి పిలిచే తీరు దగ్గర నుంచి వారితో నడుచుకునే తీరు వరకు కొత్తదనం చూపించారు
 
కరోనాను చూసి అంతా భయపడుతున్న సమయంలో ఆయన నేరుగా బాధితుల వద్దకు వెళ్లారు. అంతేనా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆటలు ఆడారు. క్వారంటైన్ సెంటర్లలో బాధితుల్లో పాజిటీవ్ మైండ్ కోసం పాటలు/ఆటలు/యోగా లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఎంతో మంది ఆదర్శంగా నిలిచింది.
 
సీఎం జగన్ నిర్దేశించిన విధంగా.. అధికారులు పల్లె బాట పట్టాలన్నది కలెక్టర్ ముందే చేపట్టారు.. గ్రామాల్లో తనదైన మార్క్ వేశారు.
 
జిల్లాలో గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రతి సోమవారం వందల సంఖ్యలో వచ్చే వారు... కాని మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టారు.
 
వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ సరిగా అందేలా చేసేందుకు సడన్ విజిట్లు చేసి వ్యవస్థను గాడిలో పెట్టారు.
 
ఉపాధి హామీ కూలీలలకు సకాలంలో డబ్బులు అందేలా చేశారు.. అంతే కాదు అందులో జరిగిన అవినీతిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా చేశారు.
 
ఇక అంగన్వాడీల పనితీరు విషయంలో కలెక్టర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వ్యవస్థలో లోపాల్ని గుర్తించి.. క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
 
అన్ని జిల్లాల్లో ఇంటి పట్టాలకు స్థలాల ఎంపిక విషయంలో గొడవలు జరుగుతున్నా.. అనంతపురం జిల్లాలో మాత్రం ఇలాంటి వివాదమే లేకుండా ఇంటి పట్టాలను సిద్ధం చేశారు.
 
అలాగే గృహ నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తూ.. అందులో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకున్నారు.
 
ప్రస్తుతం ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికారులకు ఒక స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి ముందుకు తీసుకెళ్తున్నారు.
 
అన్నిటికీ మించి జిల్లాలో రాజకీయ పరిస్థితులను తట్టుకుని ఆయన నిలబడటం ఒక విశేషమైతే.. భిన్నమైన కార్యక్రమాలతో అందరితో ప్రసంశలు అందుకోవడం మరో విశేషం. ఇలా ఒక మార్పు కోసం పయనిస్తున్న కలెక్టర్ అడుగులు ఒక్క ఏడాదిలో ఇన్ని ఉంటే.. ఆయన మరిన్ని రోజులు ఇక్కడ పని చేస్తే.. ఇంకెంత మార్పు తీసుకొస్తారో చూడాలి.