గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: మంగళవారం, 3 జనవరి 2017 (14:22 IST)

భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిందేమిటో తెలుసా?

భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ

భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. 
 
మంచి వక్త.. కులం, పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి.. యుక్తవయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి... అందరూ సమానంగా బ్రతకాలి... అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆమె తన భర్తకు తోడునీడగా నడవడం మాత్రమే కాక, స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనశీలిగా స్పూర్తిదాయినిగా ఎదిగిన నాయకురాలు, 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం, వర్గం, లింగవివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు.
 
1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గాంవ్‌లో సావిత్రిబాయి జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సున జ్యోతిరావుపూలేను వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. విద్యాజ్ఞానం నేర్పి సామాజికో పాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847 నాటికి భర్తతో కలిసి శూద్రకులాల బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. 
 
బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది.  పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభిం చాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
 
పిల్లల్ని కనాలనే కోరికని త్యజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకొని అనాధల్ని, అక్రమ సంతానంగా పుట్టి రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రీబాయి. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పారాటంలో సావిత్రిబాయి నిర్వహించినపాత్ర మరువలేము. నాటి సామాజికోద్యమాలలో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతుల్లోని ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో శూద్రుల పక్షపాతిగా అగ్రభాగాన నిలిచి మహిళలను చైతన్యులను చేశారు. 1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. 
 
వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు, శూద్రబాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చి, పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్‌ను చేశారు.1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి. పురోహితుడు లేకుండా ఒక వివాహం జరపడం చరిత్రలోనే మొదటిసారి.
 
భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా కీర్తించబడ్డ జ్యోతిబా పూలేకి అన్ని రకాలుగా తన అండదండల్నిచ్చింది. భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
 
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది.
 
సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్‌కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాలకోసం శక్తికి మించిన ఖర్చులుచేసి అప్పులపాలయ్యే వాళ్ళను విమర్శిస్తూ ''కర్జ్‌'' అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి హేతుబద్దత కవితల్లో ప్రతిబించించేవారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.