ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు
ఉత్తరాంధ్ర వైసిపి కుండకు చిన్నగా చిల్లు పడుతోంది. కీలక నాయకులు క్రమంగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఈ వరుసలో ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేరిపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా జగన్ మోహన్ రెడ్డి తొందరపడుతున్నారని, ఐదేళ్లపాటు వారి పాలనను చూసాక మనం కాదు ప్రజలే తీర్పు ఇస్తారని అవంతి అంటున్నారు. పైగా కార్యకర్తలను ఒత్తిడి చేసి ముందుకు తోస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్తకి FB, YouTube, Twitter ఖాతాలు వుండాలనీ, దాని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ జగన్ పిలుపునిచ్చారు.
ఐతే జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు నలిగిపోతున్నారని అవంతి అంటున్నారు. సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి... ప్రభుత్వం కేసులు పెడితే మన లాయర్లు చూసుకుంటారు అని అనడం ఎంతవరకు సబబు. కార్యకర్తలపై కేసులు పెడితే అది ఊరకనే పోతుందా... స్టేషన్లు చుట్టూ వాళ్లవాళ్ల కుటుంబాలను వదిలేసి తిరగాలా.. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయి వున్నదని మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వరా?
కేవలం 6 నెలల్లోనే అంతా చూపించేయాలా? గతంలో వైఎస్సార్ ఏం చెప్పారో గుర్తుచేసుకోండి.. ప్రతిపక్షాలు ఏదైనా అడిగితే... ప్రజలు మాకు ఐదేళ్లు అధికారంలో వుండమన్నారు. ఈలోపుగా మేం చేయకపోతే అప్పుడు అడగండి... ఇప్పుడే మీకు తొందర ఎందుకు అనేవారు. అట్లాంటిది మనం కేవలం 6 నెలల్లోనే అవి చేసారా ఇవి చేసారా అంటా వుంటే మనల్ని ప్రజలు నమ్ముతారా... విశ్వసిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు అవంతి శ్రీనివాస్.
ఇదిలావుంటే.. జగన్ నిర్ణయంతో ఇంకా చాలామంది నాయకులు జంప్ అయ్యే అవకాశం వుందని ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు అంటున్నారు. ఇదే జరిగితే... జగన్ చేపట్టే ఆందోళన కార్యక్రమం ప్రారంభం కాకముందే వైసిపి కుండకి పడిన చిల్లు మరికాస్త పెద్దదయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.