సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (13:23 IST)

ముందు అవంతి శ్రీనివాస్.. ఆ తర్వాత గ్రంధి శ్రీనివాస్.. వైకాపా షాక్

MLA Grandhi Srinivas
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు షాకులపై షాకులు తగులుతున్నాయి. ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన వైకాపా నేతలు ఇపుడు అధికారం దూరం కావడంతో ఒక్కొక్కరు దూరమవుతున్నారు. గురువారం ఒకేసారి ఇద్దరు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాసేపటికే మరో కీలక నేత పార్టీని వీడారు. ఆయన పేరు గ్రంధి శ్రీనివాస్. భీమవరం మాజీ ఎమ్మెల్యే. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వారు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. పార్టీలో కీలక నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతుండటం వైకాపా శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 
 
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్‌కు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‍పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. తద్వారా పార్టీలో జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. గత ఎన్నికల్లో ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్‌లు ఇపుడు ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది.