శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (18:02 IST)

ఏపీ పాలిటిక్స్‌లో మెగా మార్పు సాధ్యమా! ..... మెగాస్టార్ నోరు విప్పేనా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయా? వచ్చే ఎన్నికల నాటికి పెను మార్పులు చోటు చేసుకుంటాయా? ప్రస్తుతం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో మెగా మార్పులు ఖాయంగా చెబుతున్నాయి. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తిని రేపాయి. మెగాస్టార్ రాజకీయ పునఃరంగ ప్రవేశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ వార్తలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 
 
అంతేకాదు అందరిలోనూ ఆతృత పెంచింది. పవర్ స్టార్‌కు మెగాస్టార్ రాజకీయంగా మద్దతు ఇవ్వడం అంటే ఏంటి.? తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో కీలకపాత్ర వహిస్తారా? లేక ఎన్నికల ప్రచారానికి పరిమితమవుతారా? అన్నది అందరి ముందున్న ప్రశ్నగా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పటిష్టమైన బంధాన్ని ఏర్పరచుకొని కలసికట్టుగా ప్రయాణిస్తోంది. జనసేనకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు బిజెపి ఢిల్లీ పెద్దల అండ దండ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల దాకా రెండు పార్టీలు కలసి సాగుతాయని ఉభయ పార్టీల పెద్దలు ఘంటాపదంగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఎలా మద్దతు ఇవ్వబోతున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
 
ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి బిజెపి పెద్దలు కూడా అప్పట్లో తెగ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ రాజకీయాలకే దూరం జరిగి సినిమాలపైనే దృష్టి పెట్టిన మెగాస్టార్, రాజకీయాలంటే అంత సులువు కాదని పార్టీ పెట్టే ముందు ఆలోచించాలని తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అప్పట్లో సలహా ఇచ్చారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.
 
ఇదంతా చూస్తుంటే చిరంజీవి మళ్లీ రాజకీయాలవైపు వస్తారన్నది మాత్రం అనుమానమే అంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే తాను స్థాపించిన ప్రజారాజ్యం నుంచే రాజకీయ అడుగులు వేసిన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, ఆయన స్థాపించిన జనసేనకు తోడుగా ఉండటం కూడా చిరంజీవికి బాధ్యతగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌తో పాటు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తి పెంచాయి. 
 
మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏమి చేయబోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి ఏపీలో కీలక పాత్ర వహించి, ఆ పార్టీతో కలిసిమెలసి సాగుతున్న తన తమ్ముడు పార్టీ జనసేనకు అండగా నిలుస్తారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో చిరంజీవి చేరిక అంత తేలిక కాదు. 
 
పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వుండగా చిరంజీవి పార్టీలో ఎలాంటి బాధ్యత తీసుకోలేరు. అందుకే ప్రస్తుతం చిరంజీవి ముందున్న మార్గాలు రెండే ఉన్నాయని అవి కేవలం జనసేన బీజేపీ పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఒకటైతే, ఎన్నికల నాటికి బీజేపీలో చేరి ఆ పార్టీ లో ఎపీ తరపున కీలక వ్యక్తిగా అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారటం రెండో అవకాశంగా కొందరు చెబుతున్నారు. 
 
ఏదేమైనా ప్రస్తుతం సినిమాలపై పూర్తి దృష్టి సారించి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ నోరు విప్పితే తప్ప ఈ అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం జనసేన నాయకులు మెగాస్టార్ మద్దతు ఇస్తారంటూ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవ రూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా మార్పులు మాత్రం తథ్యం అని కొందరు విశ్లేషిస్తున్నారు. 
 
ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవికి రాజకీయాల్లో అవగాహన లేదు. కొందరు ఆయనను తప్పుదోవ పట్టించారన్నది కాదనలేని నిజం. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవటం కూడా చిరంజీవికి సవాలుగా మారింది. ప్రస్తుతం ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ఎంతో బలంగా ఉంది. 150 మంది ఎమ్మెల్యేల బలంతో పటిష్ట పాలన అందిస్తోంది.
 
అయితే ఇంతకాలం రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పూర్తిగా బలహీనపడి మళ్లీ బలపడేందుకు ఆరాటపడుతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం స్థానాన్ని తాము ఆక్రమించాలని బీజేపీ, జనసేనలు కలలు కుంటున్నాయి. అందుకే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీగా 18 స్థానాలను గెలుచుకొని, తనకంటూ కొంత శాతం ఓటింగు ఉందని నిరూపించుకున్న మెగాస్టార్‌ను మళ్లీ రంగంలోకి దింపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు సాధ్యమవుతాయని బీజేపీ-జనసేనలు భావిస్తున్నాయి. ఏదైనా ఈ మెగా సస్పెన్స్‌‌కు మెగాస్టార్ ఎప్పుడు తెర తీస్తారో అప్పుడే కొంత స్పష్టత రానుంది. 
 
ఇలావుంటే గతంలో ప్రజారాజ్యంలో కీలక పాత్ర వహించిన కొందరు ప్రస్తుతం జనసేన లో తిరిగి చేరుతున్నారు. తాజాగా ప్రజారాజ్యం ఆడిటరుగా ఉన్న ఏ.వి రత్నం కూడా జనసేన కోశాధికారిగా రీ-ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవికి అండగా ఉన్న సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య, కాపు నేతలు కూడా తాజాగా పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా ప్రజారాజ్యం నేతలు కాపు నేతలు జనసేనకు దగ్గరవుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల ముందు వరకు చిరంజీవి నోరు విప్పే అవకాశం లేదని చెప్పవచ్చు.