శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (10:09 IST)

రోజాకు సొంతింటి కుంపటి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

వైసిపి ఎమ్మెల్యే రోజాకు ఇంటిపోరు మొదలైందా... సొంత నియోజకవర్గంలో తిరుగులేదని భావించిన రోజాను సొంత పార్టీ వాళ్ళే దెబ్బ తీయనున్నారా.. వైసిపి అధికారంలోకి వస్తే మంత్రి పదవులకు ఎసరు పెడుతుందని భావిస్తున్న కొంతమంది పెద్ద తలకాయలు ఆమెను పక్కకు తప్పించే స్కెచ్

వైసిపి ఎమ్మెల్యే రోజాకు ఇంటిపోరు మొదలైందా... సొంత నియోజకవర్గంలో తిరుగులేదని భావించిన రోజాను సొంత పార్టీ వాళ్ళే దెబ్బ తీయనున్నారా.. వైసిపి అధికారంలోకి వస్తే మంత్రి పదవులకు ఎసరు పెడుతుందని భావిస్తున్న కొంతమంది పెద్ద తలకాయలు ఆమెను పక్కకు తప్పించే స్కెచ్ వేస్తున్నారా? 
 
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైసిపి మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు కొత్త కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రత్యర్థి పార్టీ నుంచి రోజాకు ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆమెను టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కొంతమంది పార్టీ బడా నేతలు అప్పుడే మంత్రి పదవులను పంచేసుకుంటున్నారు. పలువురు సీనియర్ నేతలు చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి వారికి చిత్తూరు జిల్లాలో రోజా సమస్యగా మారినట్లు తెలుస్తోంది. 
 
ఫైర్ బ్రాండ్‌గా పేరుబడ్డ రోజా తన నియోజకవర్గం నగరికే పరిమతం కాకుండా ఇతర నియోజకవర్గాల సమస్యల్లోను వేలు పెడుతుండడం కొంతమంది నేతలు భరించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే రోజాకు చెక్ పెడితే భవిష్యత్తులో వారికి అడ్డు తొలుగుతుందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రోజా తిరుపతిలోని విష్ణు నివాసంలో టిటిడి కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు మద్ధతివ్వడం పార్టీలో దుమారం రేపుతోంది. తిరుపతిలో పార్టీ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. అలాగే తిరుపతి రూరల్ ప్రాంతం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిధిలోకి వస్తుంది. అయితే స్థానిక నేతలతో మాటమాత్రం కూడా సంప్రదించకుండా రోజా ప్రతిదానికి తిరుపతికి వచ్చేస్తుండటం తానే సొంతంగా సమస్యలపై పోరాడుతానంటూ మీడియాలో ప్రకటనలు ఇచ్చేస్తూ ఉండటంతో మిగతా నాయకులు రగిలిపోతున్నారు. దీంతో ఆమె తమ నియోజకవర్గంలో పెత్తనం చేయడం ఏమిటని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. రోజా దూకుడును అడ్డుకోవడానికి కొత్తగా పథకాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా నగరిలో వైసిపి తరపున మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నగరిలో రోజాకు ఎదురులేని పరిస్థితి ఉంది. ఈ మధ్యన టిడిపి అనుకూల ప్రధాన పత్రిక నిర్వహించిన సర్వేలోను రోజాదే గెలుపని స్పష్టమైంది. మాజీ ఎమ్మెల్సీ, టిడిపి సీనియర్ నేత ముద్దుక్రిష్ణమనాయుడు మృతితో టిడిపి నగరిలో పత్తా లేకుండా పోయింది. దీంతో రోజా సునాయాసంగా గెలుస్తారన్న భావన వైసిపిలోనే కాకుండా టిడిపి నాయకులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అసలు రోజాకే వైసిపి టిక్కెట్టు దక్కకుండా చేసేందుకు అంతర్గతంగా పార్టీలోని వ్యతిరేకవర్గం భారీగానే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రోజాతో పాటు ఆమెను వ్యతిరేకిస్తున్న ప్రధాన నేతలంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనార్హం. తమ సామాజికవర్గానికే చెందిన నగరి మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి సమీప బంధువు రెడ్డివారి చక్రపాణి రెడ్డికి వైసిపి టిక్కెట్టు వచ్చేటట్లుగా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఒకవేళ ఈ ప్లాన్ కనుక వర్కవుట్ అయితే నియోజకవర్గంలో చెంగారెడ్డికి ఉన్న సానుకూలతతో పాటు ఒకే సామాజికవర్గం కావడంతో రోజాను పక్కనబెట్టినా పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు కొందరు నాయకులు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్థమవుతున్నారు. అలాగే రోజాకు స్థానికంగా జనంలో ఆదరణ తగ్గిందని, ఈ సమయంలో ఆమెకు టిక్కెట్టు ఇస్తే గెలవాల్చిన చోట ఓడిపోతామని జగన్ దృష్టికి జిల్లా నేతలు తీసుకెళ్ళారు. పాదయాత్ర బిజీలో ఉన్న జగన్ ఈ విషయంపై మళ్ళీ మాట్లాడతానని సదరు నేతలకు చెప్పినట్లుగా సమాచారం. అయితే తన వెనుక కొందరు నేతలు గోతులు తవ్వుతున్న విషయాన్ని పసిగట్టిన రోజా ఆమె కూడా వారికి ధీటుగా పథకం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
 
ఇప్పటికే జగన్ తో పాటు ఆయన కుటుంబంతోను అత్యంత సన్నిహితంగా ఉన్న రోజా వచ్చే ఎన్నికల్లో జగన్ తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడమంటూ ఉండదన్న ధీమాలో ఉన్నారు. ఇప్పటికే పలు సభల్లో పదే పదే గతంలో టిడిపి తనకు నగరి టిక్కెట్టు ఇవ్వకుండా మోసం చేసిందన్న విషయాన్ని సెంటిమెంట్ గా ప్రస్తావిస్తూ మళ్ళీ ఆ పరిస్థితి వైసిపిలో రాకుండా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అలాగే తాను రాష్ట్రస్థాయి మహిళా నేత కావడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఇతర సమస్యలపై దృష్టిపెడితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కొందరు నేతలు ప్రజా సమస్యలపై స్పందించరని, తాను స్పందిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారంటూ ఆమె తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం ప్రత్యర్థులను తన వాగ్భాణాలతో హడలెత్తించిన రోజా ఇప్పుడు పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకోవడాన్ని ప్రయత్నిస్తున్న ఇతర నేతలపైనా యుద్థానికి సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది.