సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (15:20 IST)

నమ్మి బాగుపడ్డోడు లేడు..!! ముంచుడు రాజకీయం వెన్నతో పెట్టిన విద్య

నమ్మితే ముంచుడు రాజకీయం వెన్నతో పెట్టిన విద్య అని ఆయనను నమ్మి మోసపోయినవారంటారు. వారు ఒక్కరో ఇద్దరో కాదు… లిస్టు మాత్రం చాంతాడంతా వుంటుంది. అందులో హేమా హేమీలైన నాయకులే వుంటారు. ఆయనను నమ్మి బాగుపడ్డవారెవరో గాని, నమ్మి రాజకీయం చేసిన వారెవరూ బాగుపడ్డట్టు లేదనే అంటుంటారు. అందుకు నిజాలు కూడా చూడాలి. సాక్ష్యాలు కావాలి. అనుకుంటున్నారా… వారిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా వున్నారంటారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు… తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌.
 
 
అవును 2004 ఎన్నికల ముందు ఎలాగైనా చంద్రబాబును ఓడించాలి. ఆయనను గద్దెదించాలి. అందుకు కేసిఆర్‌లో వున్న కసంతా తీర్చుకోవాలి. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రతిగా ఏదో ఒకటి చేయాలి. అందుకు జై తెలంగాణ అనాలి. ఆ మాటను ప్రేమించేవారికి అక్కున చేర్చుకోవాలి. వారితో జైకొట్టించుకోవాలి. ఇంకేముంది. ఎన్నికల దాకా ఏదో రకంగా నినాదం ముందుకు తీసుకెళ్లాలి. ఈ వైఖరే నాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఇరవైఏళ్లుగా ఎదురు చూస్తున్న వైఎస్‌కు కలిసొచ్చింది. 
 
ఓ వైపు తెలంగాణ ఉద్యమం సాగాలి. తెలంగాణ రావాలి. అందుకు మాత్రం రాజకీయంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుకు సాగాలి. ఈ వైఖరి పసిగట్టని వైఎస్‌ కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలిపారు. సరే… కావాలనుకున్న ముఖ్యమంత్రి అయ్యారు. కాని తెలంగాణ కోసం వైఎస్‌తోనే కలిసి సాగి, చివరికి వైఎస్‌ను తెలంగాణలో దోషిని చేస్తూ తన ఎదుగుదలకు నిచ్చెన వేసుకున్నాడు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు పంచన చేరి, ఆయనను పలచన చేశాడు. ఇలా తన రాజకీయ అవసరాలకు ఎవరినైనా వాడుకొని వదిలేయడం కేసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యే అంటారు.
 
ఇప్పుడు తాజాగా జగన్‌ను ఆ పద్మ వ్యూహంలోకి కేసిఆర్‌ లాగేసుకున్నాడు. ఇక అంతే ఆయనతో జిమ్మిక్కులు చేయించి, ప్రజల్లో పలుచన చేసేదాకా వదడలని కేసిఆర్‌ గురించి బాగా తెలిసిన వారు అంటున్నమాట. ఓసారి గతంలోకి తొంగిచూస్తే, తెలంగాణ కోసం ముందుకొచ్చిన తెరాస తొలి ఎమ్మెల్యే పాపారావు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. తెలంగాణ సాధన సమితి పేరుతో పార్టీ పెట్టిన టైగర్‌ నరేంద్ర పరిస్థితి ఏమైందో తెలియందికాదు. తెలంగాణ రాములమ్మగా కీర్తింపబడిన విజయశాంతి తన పార్టీని త్యాగం చేసి, కేసిఆర్‌చేత చెల్లెగా పొగిడించుకుని, రాజకీయ ఉనికే లేకుండా చేసుకున్నది. 
 
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కోసం కష్టపడ్డ వారిలో గాదె ఇన్నయ్య లాంటి వారినుంచి మొదలు, జేఏసి ఏర్పాటుతో తెరమీదకొచ్చిన కోదండరాం రెడ్డి దాకా అంతా ఆ మర్రి చెట్టు కింద కనుమరుగైన వాళ్లే. ఇలా ఒక్కరా ఇద్దరా, ఆయనతో మొదలై, ఆయనను కాదని, వెళ్లిన వారే ఎంతో మంది వున్నారు. అలా వెళ్లకపోతే, పొగ పెడతారు. పోయేలా చేస్తారు. అలాంటి వారిలో జగ్గారెడ్డి, బంజారా గాంధీ మాజీ వరంగల్‌ ఎంపి.రవీంద్రనాయక్‌ లాంటి వారు దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. మరి అలాంటి వారి వరసలో నిలిచే పరిస్థితి జగన్‌కు లేకపోయినా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిస్తేజం చేయక మానడనే అంటున్నారు.
 
ఎందుకంటే కేసిఆర్‌ మాటకు రెండు వైపులా పదునే… ఆయన ఆచి తూచి మాట్లాడతారనుకుంటారే గాని, అహంతో మాట్లాడతారాని చాలా మందికి తెలియదు. ఎవరినైనా తేలికగా మాట్లాడగలరు. అది రాజకీయ చైతన్యం అని అనుకుంటారే గాని, అది తన దూకుడును చూపించుకొనే, పిరికి లక్షణమని కూడా సైకాలజిస్టులు అంటుంటారు. ఆ మధ్య చంద్రబాబు అనవసరంగా అమరావతిలో సొమ్మంతా వృధాగా పోస్తున్నారు. అంటూ, ఎద్దేవా చేశారు. జగన్‌కు చంకనెత్తించుకున్నారు. పరోక్షంగా జగన్‌ను ప్రచారం చేసినంత పనిచేశారు. అవససరమైతే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానన్నారు. 
 
ఒకనాడు జగన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసిఆర్‌తోపాటు, తెరాస నాయకులంతా జగన్‌కు చిరునవ్వులు స్వాగతం వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దాగి వున్నాయన్న సంగతి జగన్‌ పసిగట్టకపోవడం విచారకరం. జగన్‌ ఈ మధ్య ఆడుతున్న మూడు రాజధానుల వ్యవహారం కూడా కేసిఆర్‌ మదిలో మెదిలిన చదరంగమే అని అనేవారు కూడా వున్నారు. ఓ వైపు జగన్‌కు దారి చూపుతున్నట్లు చెబుతూనే, మరో వైపు జగన్‌ త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్న మాటలు కూడా ఆంతరంగికులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు ఎంతో చేస్తే ప్రజలు ఎలా ఓడించారో ఏమో అని మరో వైపు పదును పెట్టే మాటలు మాట్లాడారట.
 
 
అమరావతిలో అవినీతి అని అంటున్న జగన్‌ ఏకంగా అవినీతి ఆరోపణలతోనే గదా జైలుకు వెళ్లింది అని కూడా అన్నారని ప్రచారం. అంటే కేసిఆర్‌ ఎలాగైనా మాట్లాడేందుకు వెనుకాడడు. ఆయన ఆలోచనలకు లోతుంటుందని అనుకుంటారే గాని, అందులో పెద్దగా విషమేమీవుండదు. కాని రాజకీయ చాణక్యుడిగా కీర్తించే భజన బృందం చెప్పే మాటలకు మీడియా తందానా అనడంతోనే ఇంత క్రేజ్‌ ఏర్పడింది. రాజకీయంగా ఆయన వేసిన ఎత్తులు ఏనాడు ఫలించలేదు. కాకపోతే తొలిసారి గెలిచిన సందర్భంలో తెలంగాణ సాధకుడిగా గెలిచారు. రెండోసారి పటిష్టమైన ప్రతిపక్షం లేక, మళ్లీ తెలంగాణ ఆగం కాకుండా వుండాలన్న ప్రజల కోరిక మేరకే తెరాస గెలిచిందే తప్ప, కేసిఆర్‌ గొప్పదనమేమీ కాదు. 2009 ఎన్నికల ఫలితాల ముందు ఎన్డీయే గెలుస్తుందన్న నమ్మకంతో బిజేపికి దగ్గరై, కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కాని నాడు యుపిఏనే గెలిచింది. అయినా ప్రజలకిచ్చిన మాటకోసం కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో బిజేపికి వ్యతిరేంగా మాట్లాడి, ఇప్పుడు దూరంగానే వుండాల్సివస్తోంది.
 
జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన లేకపోయినా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు వైఎస్‌ ఎలా ఎదురు చూశాడో, అలాగే ఎదురుచూసిన జగన్‌కు కేసిఆర్‌ మాటల తోడు గోదారిలో కొట్టుకుపోయే వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్లైంది. సరే ఇద్దరికీ కాలం కలిసివచ్చింది. అయితే నిన్నటి దాకా అంటే తెలంగాణ వచ్చేదాకా ఆంధ్రులు నీళ్ల దోపిడీ చేశారని చెప్పి, చెప్పీ తెలంగాణ ప్రజల చెవుల్లో రింగులు తిరిగేలా చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ నుంచే రాయలసీమకు సరిపడా నీటిని ఇస్తామంటే, కలిసి ప్రాజెక్టు మొదలు పెడతామంటే, నమ్మడం అంటే ఎంత విడ్డూరం. అందుకే కేసిఆర్‌ నమ్మితే రాజకీయ భవిష్యత్తుకు నీరాజనం తీసుకున్నట్లే అంటున్నారు. మరి జగన్‌ నమ్ముతాడో, నమ్మడో చూద్దాం. తెలిసిందైతే చెప్పాం. తెలుసుకోవాలని చెప్పాం. జగన్‌కు తెలియాలనే చెప్పాం. చూద్దాం.