శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2019 (20:43 IST)

నరేంద్ర మోడీ, లే... పదపదా... సాగుతున్న విజయాల పరంపర

బిజెపి వరుసగా తన అంతర్గత లక్ష్యాలను పూర్తి చేస్తోందా? కాశ్మీర్ నుంచి అయోధ్య వరకు వివాదాస్పద అంశాలపై అనుకున్న లక్ష్యాలను సాధిస్తోందా. వరుస తీర్పులు, బిల్లులు ఏం చెబుతున్నాయి. బిజెపి తరువాత అడుగులు ఎటు పడనున్నాయి.? మోడీ సర్కార్ మొదటి టర్మ్‌తో పోలిస్తే రెండవసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. యేళ్ళ తరబడి నానుతున్న సమస్యలను అనుకున్న గమ్యం వైపు పక్కా స్ట్రాటజీతో తీసుకెళుతోందని ప్రచారం జరుగుతోంది. 
 
ఆర్టికల్ 370 నుంచి అయోధ్య వరకు పలు వివాదాస్పద అంశాలను కొలిక్కి తీసుకురావడమే కాకుండా తాను అనుకున్నట్లు వచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయంలో వరుస సాధించిందనే చెప్పాలి. అధికరణ 370 రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. 1947 అక్టోబర్ 27 తరువాత జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు.
 
1952 నుంచి ఆర్టికల్ 370 అమలులో ఉంది. రక్షణ, దేశీయ వ్యవహారాలు, కమ్యునికేషన్లతో పాటు విలీన ఒడంబడికలో ప్రస్తావించిన అంశాల విషయంలో తప్ప జమ్ముకాశ్మీర్ అంగీకరించకపోతే పార్లమెంటుకు చట్టాలను ఆ రాష్ట్రానికి వర్తింపజేసే అధికారాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకాశ్మీర్ దేశంలో అన్ని ఇతర ప్రాంతాల్లా మారింది.
 
పైగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో కేంద్రంలోకి వెళ్ళింది. ఇక తాజాగా అయోధ్య కేసులో కీలక తీర్పు వచ్చింది. దాదాపు 140 యేళ్ళ పాటు దేశాన్ని ఊపేస్తోన్న సమస్య. రాజకీయంగా, సామాజికంగా అనేక చీలికలు తెచ్చిన అయోధ్య సమస్యకు ముగింపు పలికేలా సుప్రీంతీర్పు వ్యూహాత్మకమని చెప్పాలి. దశాబ్దాలుగా నానుతూ వచ్చిన సమస్యను 40 రోజుల్లో వాదనలు విని తీర్పు ఇవ్వడం అనూహ్యమని చెప్పాలి.
 
ఇక అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పునిచ్చిన రోజే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉమ్మడి పౌరస్మృతి అంశంను ప్రస్తావించారు. దానికి టైం వచ్చింది అన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ కోర్టులో సోమవారం నాడు విచారణ చేపట్టనుంది. జాతి, మత, వర్గ, లింగ బేధం లేకుండా పౌరులందరిని నిష్పక్షపాతంగా ఒకే చట్టపరిధిలోకి తీసుకురావడమే ఉమ్మడి పౌరస్మృతి ఉద్దేశం. ఈమధ్య సంచలనంగా మారిన బిల్లు ఎన్ఆర్సీ జాతీయ పౌర జాబితాను అస్సాంలో కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని కేంద్రం చెబుతోంది. 
 
దేశభద్రత దృష్ట్యా ఎన్ఆర్సీ అమలు తప్పనిసరి అని చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబుతోంది. దీనిపై ఇంకా వాద, వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ మోడీ సర్కార్ దూకుడు ముందు ఈ అడ్డంకులు నిలబడటం కష్టమేనని చెప్పాలి. ఇక చిరకాలంగా చర్చకు దారితీస్తోంది పిఓకే. మోడీ సర్కార్ ఆది నుంచి వివాదాస్పద అంశాలకు పక్కా వ్యూహంతో ముగింపు పలుకుతోంది. అనుకున్న ఫలితం దక్కేలా గట్టి ప్రయత్నమే చేస్తోంది. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిమని.. ప్రపంచ వేదికలపై ఘంటాపథంగా తేల్చి చెబుతోంది. అదే సమయంలో పాక్ ఆక్రమిత శిబిరాలలో టెర్రరిస్ట్ శిబిరాలపై విరుచుకుపడినట్లుగానే పిఓకే సమస్యను కూడా ఒక దరికి తీర్చుకుని వచ్చే అవకాశాలున్నాయి. 
 
దేశాన్ని తన రాజకీయ చాతుర్యంతో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీస్తూ వస్తోంది బిజెపి. వరుస నిర్ణయాలతో దశాబ్ధాలుగా కాంగ్రెస్ చేయలేని పనులు సాధించామనిపించుకుంటోంది. ముఖ్యంగా అక్కడి ప్రజల విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలను పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తూ తన అంతర్గత లక్ష్యాలను సైలెంట్‌గా సాధిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.