గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (14:41 IST)

నరేంద్ర మోదీ వస్తున్నారంటే కెవాడియా కాలనీ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?

గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 అడుగుల విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఏర్పాటుచేసి ఏడాదైంది. పటేల్ జయంతి సందర్భంగా ఈరోజు (అక్టోబరు 31)న ప్రధాని నరేంద్ర మోదీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కెవాడియా కాలనీకి వస్తున్నారు. కెవాడియా కాలనీలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధాని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కెవాడియా కాలనీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది.

 
'మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు'
స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 'బెస్ట్ భారత్ భవన్' కోసం తన భూమిని కోల్పోయిన కెవాడియా కాలనీకి చెందిన దిలీప్ భాయ్ బీబీసీతో మాట్లాడుతూ... ''కెవాడియా కాలనీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కానీ, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కానీ మేం కోరుకోవడం లేదు'' అన్నారు. అయితే, తమ మాట వినేదెవరంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ''ఇది వాళ్ల ప్రభుత్వం. వారేం చేయలనుకుంటే అది చేయగలరు. మా నుంచి బలవంతంగా భూమిని లాక్కున్నారు. ఇప్పుడక్కడ నిర్మాణ పనులూ మొదలైపోయాయి. మా జీవనాధారం పోయింది'' అన్నారు.

 
కెవాడియా, దాని చుట్టుపక్కల ప్రాంతాలు నేరుగా కేంద్రం పాలనలోకి వస్తే ఆ ప్రాంత ప్రజల భూములు పోయే ప్రమాదముంది. ''కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే వారు ఎక్కడ కావాలంటే అక్కడ భూములను సులభంగా సేకరించగలుగుతారు'' అన్నారు దిలీప్ భాయ్. జాతీయ సమైక్యతా దినం సందర్భంగా మోదీ వస్తుండడంతో కెవాడియా ప్రాంతమంతా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ పర్యటన కారణంగా ఎటూ కదల్లేక కెవాడియా చుట్టుపక్కలున్న గిరిజనులందరికీ పనుల్లేక ఉపాధి కోల్పోయారని దిలీప్ భాయ్ అన్నారు.

 
'బెస్ట్ భారత్ భవన్' కోసం తన భూమి తీసుకుని ప్రత్యామ్నాయంగా 40-45 కిలోమీటర్ల దూరంలో భూమి కేటాయించారని.. అంతదూరంలో ఇవ్వడంతో తాను తీసుకోలేదని దిలీప్ చెప్పారు.

 
'భూమిని వదులుకునేదే లేదు'
కెవాడియాను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారన్న విషయంపై స్థానిక గిరిజనుల్లో పెద్ద చర్చ సాగుతోందని అక్కడి సామాజిక కార్యకర్త లఖన్ ముసాఫిర్ అన్నారు. ''గత అయిదేళ్లుగా ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏమైనా కానివ్వండి.. కెవాడియా కాలనీకి ప్రత్యేక హోదా కల్పించడాన్ని కానీ, కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని కానీ మేం అంగీకరించం'' అన్నారాయన.

 
''మా భూములు ఇప్పటికే తీసుకున్నారు.. ఉపాధి లేకుండా చేశారు.. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయాలనుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన కంపెనీలకు మా భూములు అప్పగించారు. భవనాలు నిర్మిస్తున్నారు.. కానీ ఇక్కడి గిరిజనులకు కలిగే ప్రయోజనమేంటి'' అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి అధికారం ఉందని ఏమైనా చేయాలనుకోవచ్చు.. కానీ, మేం మా భూములను వదులుకునేది లేదన్నారాయన.

 
స్థానికుల్లో ఆందోళన
కెవాడియా ప్రాంత గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారి హక్కుల కోసం పోరాడుతున్న ఆనంద్ మజ్‌గావంకర్ అన్నారు. 'బీబీసీ'తో ఆయన మాట్లాడుతూ.. ''ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఊహాగానాలతో గిరిజనుల్లో ఆందోళన ఏర్పడింది. పంచాయత్ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్ ఏరియా యాక్ట్(పెసా) ప్రకారం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం తొలుత గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది'' అన్నారు.

 
మేధాపాట్కర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''అక్టోబర్ 31న ప్రారంభించే 30 ప్రాజెక్టులేమిటో తెలియాలి. కెవాడియా, కోఠి, నవగాం గ్రామాల్లోని పొలాల్లోంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ రోడ్లు వేయకుండా కోర్టు స్టే ఇచ్చింది. ఈ గ్రామాల్లోని పంటల్లోంచి రోడ్లు వేస్తే అది కోర్టు ఆదేశాలకు విరుద్ధం'' అన్నారు.

 
పెసా చట్టం ఇక్కడ వర్తిస్తుందని.. గ్రామసభ ఆమోదం లేకుండా ఏం చేసినా అది చట్ట విరుద్ధమేనని మేధా పాట్కర్ అన్నారు. పర్యటకాన్ని ప్రోత్సహించడమన్న పేరుతో 72 గ్రామాలను నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

 
ప్రభుత్వం ఏమంటోంది?
కెవాడియాను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే యోచనేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది. మీడియాలో వస్తున్న ఇలాంటి కథనాలన్నీ ఆధారరహితమని గుజరాత్ సీఎస్ జేఎన్ సింగ్ చెప్పారు. అధికారికంగా అలాంటి ప్రతిపాదనలేవీ ఇంతవరకు లేవని 'బీబీసీ'తో మాట్లాడుతూ జేఎన్ సింగ్ అన్నారు.

 
కాగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం తరువాత అక్కడ పర్యటకాభివృద్ధి పెరగడంతో కెవాడియా గ్రామపంచాయతీ అక్కడి నిర్వహణ చూసుకోలేకపోతోందని.. కాబట్టి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాన్ని కెవాడియా గ్రామపంచాయతీ నుంచి మినహాయించి ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని జేఎన్ సింగ్ చెప్పినట్లుగా 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'లో కథనమొకటి ప్రచురితమైంది.

 
''స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను కెవాడియా పంచాయతీ నిర్వహించలేకపోతోంది. కాబట్టి ఈ ప్రాంతం వరకు ప్రత్యేక పాలకమండలి ఏర్పాటు దిశగా ప్రభుత్వం యోచిస్తోంది' అని నర్మద జిల్లా కలెక్టర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ సీఈవో అయిన ఐకే పాటిల్ చెప్పారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో రాసింది.