శభాష్ ముకేష్ కుమార్ మీనా, ప్రజాస్వామ్యానికి ఆయన ఓ బంగారు మెట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కేంద్రాల వద్ద అర్థరాత్రి దాటినా ఏపీలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారంటే దాని వెనుక ఎన్నికల సంఘం కృషి ఎంతో వుంది. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు అవసరమైన సహాయక చర్యలు అందించడమే కాకుండా వారంతా ఓటు వేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముకేష్ కుమార్ మీనా విజయం సాధించారు. ఓటు వేయాలి సార్ అని ఏ ఒక్కరు ఆయన దృష్టిలోకి వచ్చినా వారితో ఓట్ చేయించారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే... ఏకంగా ఒక రైలుకే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి ఓటర్లు సరైన సమయానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేట్లు చేసారు.
అసలు విషయానికి వస్తే.. నాందేడ్-విశాఖపట్నం(20812) సూపర్‌ఫాస్ట్ రైలు ఆదివారం నాడు సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరింది. ఐతే రైల్వే భద్రతా పనుల వల్ల రైలును మధ్యమధ్యలో ఆగుతో వస్తోంది. దీనితో ఆ రైలు సోమవారం ఉదయం 9 గంటలకు చేరుకోవాల్సి వుండగా దాదాపు 7 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తుంది. ఆ రైలులో ఓటు వేసేందుకు ఎక్కిన ప్రయాణికులు దాదాపు 800 మందికి పైగా వున్నారు. వారిలో కొందరు వీడియో తీసి మేము ఓటు వేయగలమా లేదా అంటూ ఎన్నికల సంఘానికి ట్యాగ్ చేసారు.
ఈ విషయం సీఈఓ ముకేష్ కుమార్ మీనా దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన విజయవాడ-విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజరుతో మాట్లాడి పోలింగ్ ముగిసేలోపుగా విశాఖ చేర్చాలని కోరారు. దాంతో ఆ రైలుకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం ఆగాల్సిన ప్రదేశాల్లో మాత్రమే ఆపుతూ ఎక్కడా క్రాసింగ్ లేకుండా సాయంత్రం 5.15 గంటలకల్లా విశాఖకు చేర్చారు. రైలు దిగిన వెంటనే ఓటర్లు చకచకా తమ ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తక్షణం స్పందించి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారనీ, ఇలాంటి అధికారులు ప్రజాస్వామ్యానికి బంగారు మెట్టు లాంటివారంటూ ఓ పెద్దాయన ప్రశంసించారు.
ఇక రాష్ట్రంలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో సైతం ఎప్పటికప్పుడు నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి, పరిస్థితులను తెలుసుకుంటూ ఇబ్బందికర ప్రదేశాల్లో ఓటింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకుంటూ వచ్చారు. మరోవైపు ఓటు వేసే సమయం ముగిసిపోతుందని పలువురు ఓటర్లు ఆందోళన చెందుతుండగా వారికి ధైర్యం చెప్పి మీరు ఓటు వేసే వరకూ ఓటింగ్ కేంద్రం తెరిచే వుంటుందని భరోసా ఇచ్చారు. అలా మొత్తమ్మీద రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తన శాయశక్తులా కృషి చేసారు. కనుకనే ఎప్పుడూ లేనివిధంగా అత్యంత భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.