1381 కేజీల గోల్డ్ గోవిందా... ఆయనే పట్టించారా?

జె| Last Modified సోమవారం, 22 ఏప్రియల్ 2019 (17:35 IST)
చేతులు కాలాక ఆకులు పట్టుకుందన్న చందంగా తయారైంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల పరిస్థితి. కోట్లాదిరూపాయల విలువైన శ్రీవారి బంగారం సీజ్ చేసి అది కాస్త దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో ఆలస్యంగా స్పందించారు అధికారులు. బంగారం సీజ్‌కు తమను బాధ్యులను చేయొద్దంటున్నారు ఈఓ. గత నాలుగురోజుల నుంచి బంగారం సీజ్ వ్యవహారం చర్చ జరుగుతున్న నేపథ్యంలో టిటిడి ఉన్నతాధికారులు అత్యుత్సాహంపై విమర్సలొస్తున్నాయి. కోట్ల రూపాయల విలువచేసే శ్రీవారి బంగారాన్ని అసలెందుకు సీజ్ చేశారు. బంగారం సీజ్ అవ్వడానికి బ్యాంకు అధికారుల నిర్లక్షమూ ఒక కారణమేనా..

తిరుమల. ఈ పేరు వింటేనే మొదటగా గుర్తుకు వచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి. ప్రతిరోజు లక్ష నుంచి లక్షా 25వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. శ్రీవారికి ఎంతో భక్తిభావంతో మ్రొక్కులు సమర్పిస్తూ ఉంటారు. భక్తుల మ్రొక్కులు వెలకట్టలేనిదని సాక్షాత్తు స్వామివారే చెప్పినట్లు పురాణాల్లో ఉన్నాయి. తిరుమల శ్రీవారికి కొంతమంది నగదు రూపంలో మరికొంతమంది నగల రూపంలో మ్రొక్కులను సమర్పిస్తూ ఉంటారు. ఇప్పటివరకు టిటిడిలో భక్తులు సమర్పించిన మొత్తం బంగారాన్ని మెల్ట్ చేసి బిస్కెట్లలాగా టిటిడి అధికారులు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం 9,752 కిలోల బంగారం ఉంది. 2016 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన టిటిడికి చెందిన 1311 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో టిటిడి 1.75 శాతం వడ్డీరేటుకు డిపాజిట్ చేసింది. 2019 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీకి మూడు సంవత్సరాల కాలపరిమితి ముగిసింది. దీంతో వడ్డీతో పాటు మొత్తం 1381 కిలోల బంగారాన్ని ఏప్రిల్ 19వ తేదీన తీసుకువచ్చి టిటిడి ఖజానాకు అందజేయమని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు లేఖ రాశారు. దీంతో చెన్నై నుంచి ఒక లారీలో బంగారాన్ని తీసుకుని తిరుపతికి బయలుదేరారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు.

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో లారీలో వెళుతున్న బంగారాన్ని గుర్తించి తిరువళ్లూరు సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు చూపించిన వివరాలు పోలీసులు నమ్మకపోవడంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం మొత్తం టిటిడిదేనని పోలీసులకు, ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు చెప్పే ప్రయత్నం చేశారు బ్యాంకు సిబ్బంది. దీంతో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు టిటిడికి సమాచారమిచ్చారు. ఈ బంగారానికి సంబంధించి ఇన్‌కంటాక్స్ కాగితాలను, మిగిలిన వివరాలను తీసుకురమ్మని నోటీసులు చేశారు. వెంటనే టిటిడికి చెందిన అధికారులు మొత్తం వివరాలను తీసుకుని తమిళనాడుకు బయలుదేరారు.

ఎన్నికల ఫ్లెయింగ్ స్క్వాడ్‌కు మొత్తం వివరాలను చూపించారు. దీంతో 19వ తేదీ బంగారాన్ని తిరిగి పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు పోలీసులకు అప్పజెప్పేశారు. 20వ తేదీ ఉదయం తిరుపతిలోని టిటిడి ఖజానాకు తీసుకువచ్చి బంగారాన్ని అప్పగించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు.

తమిళనాడులో బంగారం సీజ్‌కు టిటిడికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. బ్యాంకులో నగలు గానీ, నగదు గానీ డిపాజిట్ చేసిన తరువాత పూర్తి బాధ్యత బ్యాంకు అధికారులే తీసుకోవాలన్నారు ఈఓ. మొత్తంమీద టిటిడి బంగారం వ్యవహారం నాలుగురోజుల్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఐతే ఈ వ్యవహారంపై ఓ స్వామీజీ మాట్లాడుతూ... తితిదే నగలను ఇలా ఓ డొక్కు వాహనంలో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఎలా తరలిస్తారు... వీటిని దొడ్డిదారిన తరలించేందుకు ప్రయత్నం చేశారా... ఇంతకుముందు ఇలా ఎంత బంగారాన్ని కాజేశారు... ఇవన్నీ సీబీఐతో విచారణ చేయించాలంటూ డిమాండ్ చేశారు. బంగారాన్ని ఇలా దాటవేసేందుకు ప్రయత్నించడం వల్ల ఆ విషయాన్ని స్వయంగా తిరుమల వెంకన్నే పట్టించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన అవసరం తితిదేపై ఉంది.దీనిపై మరింత చదవండి :