శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:18 IST)

డామిట్ కథ అడ్డం తిరిగింది... ఢిల్లీలో 'పెద్ద' లాబీయింగ్!!

డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ, ఏపీ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరితో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై లేనిపోని ఆరోపణలు చేస్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఇపుడు ఏకంగా ఆ పార్టీ పుట్టె ముంచేలా ఉంది. 
 
ఇలా లేఖ రాయడం జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. పైగా, ఆరోపణలు చేస్తూ ఇలా లేఖ రాయడం, దాన్ని మీడియాకు బహిర్గతం చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ వ్యవహారం చివరకు తమ మెడకు చుట్టుకునేలా ఉందని గ్రహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి... వైకాపా 'పెద్ద' తలకాయను రంగంలోకి దించారు. బాబ్బాబు.. ప్లీజ్ మాకు మద్దతుగా మాట్లాడండి. జగన్ లేఖ రాయడం సబబేనంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటూ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
 
అయితే, ఆ పెద్దాయన చేస్తున్న విజ్ఞప్తికి ప్రస్తుత న్యాయమూర్తులు, అడ్వకేట్లు, బార్ అసోసియేషన్ల నుంచి మద్దతు కరువైంది. ఇక తమవల్ల కాదని భావించిన ఆ పెద్దాయన.. ఆ బాధ్యతలను ఏకంగా ఓ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీ (పీఆర్ ఏజెన్సీ)కి అప్పగించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఆ ఏజెన్సీ... జాతీయ స్థాయిలో వివిధ మీడియా సంస్థలను సంప్రదిస్తూ, తమకు అనుకూలమైన ఇంటర్వ్యూలు, కథనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. ఈ పీఆర్’ కసరత్తులో భాగంగానే... గురువారం జగన్‌ మీడియాలో, ఆయనకు అనుకూలంగా సర్వీసులో ఉన్నపుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఏకే గంగూలీ ఇంటర్వ్యూ ప్రచురితమైనట్లు తెలుస్తోంది.
 
నిజానికి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోర్టులు, జడ్జిలపై వ్యూహాత్మకంగా దాడి మొదలుపెట్టింది. జడ్జిలకు, న్యాయ వ్యవస్థకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ ప్రభుత్వ పెద్దలే తీవ్ర దూషణలు చేశారు. దీనికి పరాకాష్టగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు పలువురు హైకోర్టు జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేనిపోని ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. 
 
అంతటితో ఆగకుండా ఆ పత్రాలను బహిర్గతం చేశారు. కేసుల డొంక కదులుతున్నందునే ఇలాంటి చర్యకు పాల్పడ్డారనే వ్యాఖ్యలు బలంగా వినిపించాయి. ఈ విషయంలో... విజ్ఞులైన న్యాయ నిపుణులు, తటస్థ మేధావులెవరూ జగన్‌ చర్యను పూర్తిస్థాయిలో సమర్థించడంలేదు.
 
'నిజంగా తనకు ఇబ్బందులు ఎదురవుతుంటే ఫిర్యాదు చేయవచ్చు. కానీ, లేఖను బహిర్గతం చేయడం ముమ్మాటికీ తప్పే' అని కొందరు పేర్కొంటున్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన కొన్ని రహస్య లేఖలను కూడా బహిర్గతం చేయడం అనైతికం, అనుచితం, కోర్టు ధిక్కారమేనని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. 
 
జాతీయ స్థాయిలో ఓ ఆంగ్ల మీడియా చానెల్ కొంతవరకు జగన్‌కు మద్దతు కూడ గట్టేందుకు ప్రయత్నించినా... అది ఫలించలేదు. దీంతో వైసీపీ 'పెద్దాయన' పావులు కదిపారు. జగన్‌ చర్యలను ఖండిస్తున్న న్యాయవాదులు, న్యాయనిపుణులకు కౌంటర్‌గా తమను సమర్థించే వారిని వెతికి, ఏదోలాగా వారితో మాట్లాడించే బాధ్యతను ఒక పీఆర్‌ ఏజెన్సీకి అప్పగించినట్టు సమాచారం. 
 
ఆ ఏజెన్సీ చేసిన కృషి ఫలితంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ జాతీయ మీడియాతో పాటు.. సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం జగన్ లేఖ రాయడాన్ని సమర్థించడం కొసమెరుపు. మొత్తంమీద సీఎం జగన్ రాసిన లేఖ ఇపుడు ఏకంగా ఆయన మెడకే చుట్టుకునేలా ఉంది.