శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (17:36 IST)

విజయశాంతి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? గులాబీ గూటికా.. కమల తీర్థమా?

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా రీ- ఎంట్రీ ఇచ్చి, మళ్లీ నటనలో తన ప్రత్యేకతను చాటుకున్న రాములమ్మకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రాములమ్మ తదుపరి చిత్రం ఏమిటని టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కానీ లేడీ అమితాబ్ మాత్రం సూపర్ హిట్ సినిమా తర్వాత కొత్తగా నటించబోయే చిత్రం గురించి చెప్పకుండా... ఆమె అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. 
 
ఇంతకీ ఈ వార్త సారాంశం ఏమిటంటే.. మళ్లీ తాను సినిమాల్లో ఎప్పుడు నటిస్తానో తెలియదని... సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ రాములమ్మ అనూహ్య ప్రకటన చేశారు. ఇంతకీ ఈ ప్రకటన చేయడానికి గల కారణం ఏమిటి? మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించ పోతున్నారా? సినిమాలకంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విజయశాంతి తీసుకున్న నిర్ణయం వెనుక వ్యూహం ఏమిటి? ప్రస్తుతం రాజకీయ వర్గాలతోపాటు సినీరంగ ప్రముఖుల మెదళ్లను కూడా ఈ ప్రశ్నలు తొలిచేస్తున్నాయి.
 
అసలు విషయానికి వస్తే.. 13 ఏళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా లేడీ అమితాబ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని విషయం సరిలేరు నీకెవ్వరు చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి సినిమా సూపర్ హిట్ అయినంతవరకు ప్రతి ఒక్కరి విశ్లేషణ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందు పరిస్థితితో పోలిస్తే, సినిమా సూపర్, డూపర్ హిట్ అయిన తర్వాత చిత్ర రంగంలోనే కాకుండా... రాజకీయాల్లో కూడా రాములమ్మ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. 
 
సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడానికి ముందు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్‌గా ఉన్న విజయశాంతి, ఆ పార్టీ నేతల వైఖరితో విసుగెత్తి పోయారు. దీంతో ఆమె కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అంటీ, ముట్టనట్లు ఉంటున్నారు.. దీంతో రాములమ్మ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అటు విజయశాంతి కూడా ఈ ఊహాగానాలను బలపరిచే విధంగా ఆర్టికల్ 370 రద్దు, దేశ భద్రత అంశాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడం కొసమెరుపు. 
 
దీంతో సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ తర్వాత రాములమ్మ కాషాయ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అన్న వాదన బలపడింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా విజయశాంతి మరో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఇంతకీ ఈ కొత్త బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే... కమలనాథుల క్యాంపుకి చేరాల్సిన రాములమ్మ... రూటు మార్చి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ వాదనను బలపరుస్తూ ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ మీట్ వరంగల్‌లో జరిగినప్పుడు... తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది టిఆర్ఎస్ నేతలే అనే ఒక వాదన కూడా వినిపించింది. ఈ కార్యక్రమంలో రాములమ్మను ఎర్రబెల్లి దయాకర్ రావు డైనమిక్ లీడర్‌గా సంబోధించారు. అంతటితో ఆగకుండా సినిమా సక్సెస్ మీట్ అయిన తర్వాత, చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ఎర్రబెల్లి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 
 
సక్సెస్ మీట్ వరకు ఎర్రబెల్లితో కలిసి రాములమ్మ ఒకే వేదికను పంచుకోవడంలో విశేషం లేకపోయినా.. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎర్రబెల్లి ఇంటికి వెళ్లి, విజయశాంతి  విందులో పాల్గొనడంతో పాటు... కొంతసేపు రహస్య మంతనాలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. అందుకే వరంగల్ నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకు గులాబీ బాస్ కెసిఆర్‌ను విమర్శిస్తూ ప్రకటన విడుదల చేసిన రాములమ్మ... టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాత్రం అభినందించడం కొసమెరుపు. ఈ మొత్తం ఉదంతం చూసిన తర్వాత కొత్త వాదన తెరపైకి వచ్చింది. 
 
తెలంగాణలో టిఆర్ఎస్ కు రాబోయే రోజుల్లో బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో చరిష్మా ఉన్న నేతలు తెలంగాణ బిజెపిలో కరువయ్యారు. అటు సినీ గ్లామర్, ఇటు రాజకీయ అనుభవం ఉన్న రాములమ్మ బిజెపిలో చేరితే.. బీజేపీకి పార్టీకి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంటుందని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే శత్రువు శిబిరం బలపడకముందే మేలుకొని, రాములమ్మను టిఆర్ఎస్‌లో చేర్చుకుని, ఓ కీలక పదవి అప్పచెప్పడం మేలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
దీన్ని పరిగణలోకి తీసుకునే ఎర్రబెల్లి వంటి నేతలు రాములమ్మతో రాయబారం నడుపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ హిట్‌తో మంచి ఉత్సాహం మీద ఉన్న లేడీ అమితాబ్... కమలం, గులాబీలలో దేనిని ఎన్నుకుంటారని వేచి చూడాలి.