మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (12:43 IST)

మంగ‌ళ‌గిరి యువసేన లోకేష్ బాబును గ‌బ్బుప‌ట్టిస్తోందా?

నారా లోకేష్... తెలుగుదేశం యువ నేత‌... రాజ‌కీయ దిగ్గ‌జం నారా చంద్ర‌బాబు నాయుడుకి ఏకైక వార‌సుడు. తెలుగుదేశం పార్టీకి కాబోయే రాజ‌కీయ వార‌సుడు. అలాంటి యువ నేత‌ను ఆ పార్టీ సోష‌ల్ మీడియా విభాగమే... ప‌క్క‌దారి ప‌ట్టిస్తోందా? ఆయ‌న‌కు వెన్నంటి ఉన్నామ‌ని చెప్పుకునే, సొంత నియోజ‌క‌వ‌ర్గం... మంగ‌ళ‌గిరి యువ సేనే ఈ యువ కిశోరాన్ని గ‌బ్బు ప‌ట్టిస్తోందా?  సోష‌ల్ మీడియా వింగ్ అంటూ, ఓ అత్యుత్సాహ‌పు టీమ్ లోకేష్‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తోంద‌ని ఆ పార్టీకే చెందిన మీడియా ఆరోపిస్తోంది. దీనికి ఓ చిన్న ఉదాహ‌ర‌ణలో సోష‌ల్ మీడియా ట్వీట్లు. 
 
టీడీపీ యువ నేత నారా లోకేష్ ఏనాడు... ఇలాంటి ట్వీట్లు పెట్ట‌మ‌ని గాని, ఇలాంటి సందేశాల్ని జ‌నంలోకి తీసుకెళ్ళ‌మ‌ని చెప్ప‌ర‌ని, కానీ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని యువ నేత‌ను ఇంప్రెస్ చేయ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ కామెంట్స్ అంటూ, అసంబ‌ద్ధ‌మైన ట్వీట్లు, కామెంట్లు, పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలోకి వ‌దిలి... రాజ‌కీయ మ‌నుగ‌డ‌ను గ‌బ్బు ప‌ట్టిస్తున్నార‌ని అంటున్నారు.

తాజాగా ఈ మీడియా వ‌దిలిన ఈ పోస్ట‌ర్ చూస్తే, అలాంటి అనుమానాలే క‌లుగుతాయి. ఇందులో ఎవ‌రు గ‌ద్ద‌లు....ఎవ‌రు గ‌బ్బిలాలు... ఒక వేళ తాము పోరాడుతున్న వైసీపీ నేత‌లే గ‌బ్బిలాలు అయితే... గ‌ద్ద‌లు టీడీపీ నేత‌లా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి పొంత‌న లేని కామెంట్స్ వ‌ల్ల యువ నేత నారా లోకేష్ స్థాయి మ‌రింత దిగ‌జారిపోతోంద‌ని వాపోతున్నారు. వాస్త‌వానికి మంచి విజ‌న్ ఉన్న నేత లోకేష్ అని, ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లోకి చురుకుగా పాల్గొన్న ఆరంభంలోనే ఎన్నో విజ‌య‌వంత‌మైన ప‌నులు చేశార‌ని చెపుతున్నారు.

ముఖ్యంగా కార్య‌కర్త‌ల‌కు ఇన్య్సూరెన్స్ మొద‌లుకొని, పార్టీలో మానిట‌రీ ప్లానింగ్ వ‌ర‌కు అంతా స‌మర్ధంగా లోకేష్ బాబు న‌డ‌ప‌గ‌ల‌డ‌ని వివ‌రిస్తున్నారు. ఇంత‌టి స‌మ‌ర్ధ యువ నేత‌ను ఏవో కొన్ని ప్ర‌సంగాల‌ను రీ-రికార్డింగ్ చేసి, ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌దేప‌దే సోష‌ల్ మీడియాలో పెట్టి... ట్రెండింగ్ చేసి....చివ‌రికి ప‌ప్పు అనే టాగ్ లైన్ త‌గిలించాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

దాని నుంచి ఇపుడిపుడే లోకేష్, స్వ‌శ‌క్తితో బ‌య‌ట‌ప‌డుతుండ‌గా, ఇపుడు మ‌ళ్ళీ త‌మ పార్టీ వారే ఇలాంటి ప‌నికిమాలిన క్యాప్ష‌న్లు పెట్టి, గ‌బ్బు ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అవును... అంతే కదా... ఇందులో గ‌బ్బిలం ఎవ‌రు? గ‌ద్ద‌లు ఎవ‌రు?